మంచిర్యాల, జూలై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పంచాయితీ తారస్థాయికి చేరింది. ఎంపీ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయుల పంచాయితీ ముదిరిపాకాన పడింది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో జూలై 18న ఎంపీ వంశీకృష్ణ పర్యటనను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు అడ్డుకొన్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్ వర్గానికి చెందిన కార్యకర్తలు వందలాదిగా గూడెం గ్రామానికి చేరుకొని అక్కడ ఎంపీ వర్గీయులు ఏర్పాటు చేసుకొన్న ఫ్లెక్సీలను తొలగించారు. జిల్లా టైగర్ పీఎస్సార్.. జై కాంగ్రెస్ అని నినాదాలు చేస్తూ ఆ ఫ్లెక్సీలను తొలగించారు.
అనంతరం ఎంపీ వంశీ స్కూల్ పిల్లలకు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీ కాన్వాయ్‌పైకి దూసుకొచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాన్వాయ్కి భద్రత కల్పించడంతో ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎంపీ వంశీకృష్ణ వర్గీయుడైన ఓ నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులపై తాజాగా దండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ వంశీకృష్ణను చంపడానికి కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారు.
మరికొందరు ఎంపీ ఫ్లెక్సీలను చింపేశారు. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోగలరు. వారి గుర్తుగా ఫొటోలు, వీడియోలు పెన్‌డ్రైవ్‌లో ఇస్తున్నాం’ అని ఆయన వర్గీయుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారని ఎంపీ వర్గీయులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వర్గీయులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, దాడి ఘటనపై ఫొటోలు, వీడియోలు సహా ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని మండిపడుతున్నారు.
మంత్రి పదవి వచ్చినా ఎమ్మెల్యే పీఎస్సార్ మంచిర్యాల జిల్లాలో తనకు పట్టు దొరుకకుండా చేస్తున్నారనే భావనలో మంత్రి వివేక్ ఎప్పటి నుంచో ఉన్నారని ఆయన సన్నిహితులే చెప్తున్నారు. మంత్రి పదవి వచ్చిన తొలినాళ్లలోనే బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడిన మాటలు వైరం పెంచాయని అంటున్నారు. ‘ఎవరి నియోజకవర్గంలో వారే రాజు, వారే మంత్రి.. ఒకరి నియోజకవర్గంలో ఒకరు జోక్యం చేసుకోవద్దు. బెల్లంపల్లి ఎమ్మెల్యే మా అన్న వినోద్. అక్కడ ఆయనదే నడువాలి’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఎమ్మెల్యే పీఎస్సార్ జోక్యం చేసుకోవద్దని ఆయన చెప్పకనే చెప్పారు. కానీ, ఆ ఎన్నికల్లో పీఎస్సార్ సోదరుడు సత్యపాల్‌రావు గెలుపొందారు.
అప్పటి నుంచి మంచిర్యాల జిల్లాపై పట్టు సాధించాలన్న తపన మంత్రిలో మరింత పెరిగిందన్న చర్చ స్థానికంగా నడుస్తున్నది. ఈ సమయంలో దండేపల్లి మండల నాయకులు కొందరు వివేక్‌ను ఆశ్రయించడం, వారి కోసం మంత్రి వివేక్, ఎంపీలు కార్యక్రమాలు చేస్తుండటంపై స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఎంపీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఆయన వర్గం ప్రయత్నించిందని చెప్తున్నారు. దీంతో మంత్రి వివేక్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొన్నారని, తాజా ఘటనపై పంతానికి పోయి తమ వర్గీయులతో కేసులు నమోదు చేయించారని, స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఎంపీ వంశీతో డీజీ స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది.
కేసు నమోదు విషయంలో పోలీసులపై ఎంపీ డీజీ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారన్న ప్రచారం స్థానికంగా నడుస్తున్నది. ఎంపీ వంశీ వర్గీయులు కేసు నమోదు చేయడం వెనుక మంత్రి వివేక్ హస్తం ఉన్నదన్న గుసుగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు, ఎంపీ వంశీకృష్ణ తండ్రి మంత్రి వివేక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరిగాయి. దానిని మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే పీఎస్సార్ మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ, మంత్రి వివేక్ విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంపై గతంలోనూ ఎంపీ వంశీ ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా గూడెంలో జరిగిన ఘటనపై ఎంపీ వంశీ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.