కోస్గి, జూలై 22 : నిబంధనలు ఉల్లఘించి నిరసన ర్యాలీ చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నారాయణపేట జిల్లా కోస్గిలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. అధికార పార్టీకో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయం ఉంటదా? అని ప్రశ్నించారు. హోం శాఖ బాధ్యతలను తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. జిల్లా మొత్తం 30యాక్ట్ అమలులో ఉండగా నిరసన ర్యాలీ తీస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిన సీఎం రేవంత్‌కు ఓటమి భయం పట్టుకున్నదని దుయ్యబట్టారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను, ప్రజలను దగాచేసిన సీఎం రేవంత్‌కు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కొడంగల్ ప్రజలు ఓడిస్తారేమోనన్న భయం తో రేవంత్ మళ్లీ ‘సర్’ను చూపి 22వేల దొంగ ఓట్లను చేర్పించాలని బహిరంగంగా వారి కార్యకర్తలకు చెప్పడం ఆయన ఓటమికి తొలి నిదర్శనమని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ తీసి సమావేశం నిర్వహించిన సీఎంపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎస్పీని కోరారు. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే తాము చేపట్టే ర్యాలీలు, సమావేశాలపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని సూచించారు.