హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు కావడంతో ఇండ్ల నుంచి జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే రెండ్రోజులు పలు జిల్లాల్లో 44 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. శుక్రవారం అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 44.4 డిగ్రీలు నమోదు కాగా, ములుగులో 44.3, జగిత్యాలలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఈ ఏడాది వర్షాకాలం ముందే ప్రారంభం కానున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.