ఖమ్మం, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హరిత ప్రేమికుడు, పద్మశ్రీ దరిపల్లి రామయ్య(87) అలియాస్ వనజీవి రామయ్య శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మృతితో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. మరణానికి ఒక్కరోజు ముందు సైతం తన దైనందిన కార్యక్రమంలో భాగంగా విత్తనాలు సేకరించి ఇంటికివచ్చిన రామయ్య, తన స్వగృహంలో రాత్రి భోజనం చేసి పడుకున్నారు. నిత్యం తెల్లవారుజామునఐదు గంటలకు నిద్రలేచే అలవాటు ఉన్న రామయ్య.. టైమ్‌కి లేవకపోయేసరికి అతని భార్య జానకమ్మ అనుమానంతో దగ్గరికి వెళ్లి చూడగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దీంతో పక్కింటివారి సాయంతో హుటాహుటిన ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. రామయ్యను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మృతిచెందినట్టు తెలిపారు. రామయ్య భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు రెడ్డిపల్లిలోని తన స్వగృహానికి తరలించారు.
‘పచ్చటి చెట్టు ప్రాణం విడిచింది’ అనే వార్తలు ఒక్కసారిగా సోషల్‌మీడియా, మీడియా ప్రచార సాధనాల ద్వారా విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 50 ఏండ్లుగా మొక్కల పెంపకం చేపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న రామయ్య మరణవార్తతో ఆయన అభిమానులు, ప్రకృతి ప్రేమికులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రామయ్యను కడసారి చూసేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున రెడ్డిపల్లికి తరలివచ్చారు. భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామయ్య మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, తెలుగు రాష్ర్టాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, నారా లోకేశ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణతోపాటు వివిధ పార్టీల నాయకులు, సామాజికవేత్తలు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తంచేశారు. రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రామయ్య అంత్యక్రియలు ఆదివారం రెడ్డిపల్లిలో జరుగనున్నాయి.
రామయ్య వైద్యం కోసం కేసీఆర్ ఆర్థికసాయం..
2018లో వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు ఖమ్మం దవాఖానకు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కేర్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. వనజీవి రామయ్య వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తి : మోదీ
పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం తెలుగులో ట్వీట్ చేశారు. రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారని, లక్షలాది మొక్కలు నాటి, వాటి రక్షణకు ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారని కొనియాడారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతిపై గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాలపై బాధ్యతను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్ర గాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.
రామయ్య జీవితం స్ఫూర్తిదాయకం :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఇంటిపేరును వనజీవిగా మార్చుకుని పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ రామయ్య స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. ప ర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకునే క్రమంలో రామయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రామయ్య మృతి తీరనిలోటు :మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరని లోటని హరీశ్‌రావు పేర్కొన్నారు. వృక్షో రక్షతి రక్షిత: అనే సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి మొక్కలను కన్నబిడ్డల వలే పెంచి ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారని కొనియాడారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని ఆపలేదని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు.
రామయ్య సంకల్పం ఆదర్శం : కవిత
వృక్షో రక్షతి రక్షిత: అనే నినాద స్ఫూర్తితో హరిత కోటీశ్వరుడు వనజీవి రామయ్య మరణంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మొక్కలు నాటడాన్ని తన జీవితాశయంగా పెట్టుకుని తన ఆచరణను వారసత్వంగా కుటుంబానికి అందజేయడం అభినందనీయమని శనివారం ఎక్స్ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు. రామయ్య భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన సంకల్పాన్ని కొనసాగించడమే మనం ఆయనకిచ్చే నివాళి అని పేర్కొన్నారు. శోకార్తులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జీవితాన్ని ధారపోశారు : సంతోష్‌కుమార్
మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని ధారపోసిన వనజీవి రామయ్య మరణం తనను ఎంతగానో బాధించిందని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అంకితమవ్వాలని పిలుపునిచ్చారు.
రామయ్య జీవితం స్ఫూర్తిదాయకం : నిరంజన్‌రెడ్డి
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూ ర్తిదాయకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రామయ్య మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.