నిజామాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ( Congress ) పాలనలో తెలంగాణ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) ఆందోళన వ్యక్తం చేశారు. కమ్మర్పల్లి మండలంలో బీఆర్ఎస్( BRS ) బాల్కొండ నియోజక వర్గ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వద్దకు సీఎం రేవంత్ రెడ్డి సందర్శనకు వెళుతున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలతో లోపాయికారి ఒప్పందం చేసుకుని తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేయబోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం,మంత్రులు కబ్జాలకు పాల్పడుతున్నారని, అవినీతి బాగోతంపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.

రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని, ధాన్యం తరలించడానికి లారీలు పంపడం లేదని అన్నారు. అక్రమంగా ఇసుకను తరలించడానికి వందలాది లారీలు వస్తున్నాయని ఆరోపించారు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జాజల సురేందర్, జీవన్ రెడ్డి, దావ వసంత, వీజీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.