Rythu Bharosa | హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): శాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. పంట వేసిన భూమి గుర్తింపులో కచ్చితత్వం కోసం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఏఈవోలు చేస్తున్న మ్యాన్యువల్ సర్వేకు తోడుగా శాటిలైట్ సర్వే ద్వారా పంటల సాగును లెక్కించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
శాటిలైట్ సర్వే నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)కి అప్పగించినట్టు తెలిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రస్థాయి సంస్థ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీఆర్ఏసీ) ఎన్ఆర్ఎస్సీతో కలిసి పని చేయనున్నది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తిచేసినట్టు సమాచారం. అయితే, ఏఈవోలు చేసిన సర్వేకు, శాటిలైట్ సర్వేకు సుమారు 10% తేడా ఉన్నదని గమనించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో శాటిలైట్ సర్వేను మరింత పకడ్బందీగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటల సాగును లెక్కిస్తున్నారు. మొన్నటివరకు మ్యాన్యువల్‌గా లెక్కించిన ఏఈవోలు ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ క్రాస్ సర్వే ద్వారా లెక్కిస్తున్నారు. ఇది కూడా దాదాపుగా శాటిలైట్ సహాయంతోనే చేస్తున్నారు. పంట పొలంలో నిల్చుంటేనే ఈ యాప్ పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్ఆర్ఎస్సీ, అటు ఏఈవోలు చేసే డిజిటల్ క్రాస్ బుకింగ్ సర్వే లెక్కల ఆధారంగా రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
వ్యవసాయాన్ని స్థిరీకరించాలని, రైతులకు ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు సాగుకు అనుకూలమైన భూమికి రైతుబంధు అందించగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నది. ఈ లెక్కన వానకాలంలో పంటలు సాగు చేసి, యాసంగిలో పంటలు వేయని భూములకు రైతు భరోసా రాదు. నిజానికి, వానకాలంతో పోల్చితే యాసంగిలో సగం విస్తీర్ణంలోనే పంటలు సాగవుతాయి. వానకాలంలో 135 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, యాసంగిలో 60 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతాయి. దీంతో యాసంగిలో సగం భూమికి, సగం మంది రైతులకు రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో సాగుకు అనుకూలమైన భూమి ఉన్నప్పనటికీ నీళ్లు లేక, పంటలు వేయలేక నష్టపోయిన రైతులకు కనీసం రైతు భరోసా కూడా దక్కని పరిస్థితి ఎదురుకాబోతున్నది.