SHG | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల ఆదరణ పొందిన బతుకమ్మ చీరల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. బతుకమ్మ చీరలకు బదులుగా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఏడాదికి 2 చొప్పున చీరలు పంపిణీ చేస్తామని రేవంత్‌రెడ్డి సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఏడాది గడిచినా ఒక్క చీర కూడా పంపిణీ చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో 63 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఏటా 2 చీరల చొప్పున 1.26 కోట్ల చీరలు పంచాలంటే పథకానికి రూ.400 కోట్లు అవసరం. సీఎం రేవంత్‌రెడ్డి చీరల డిజైన్లను కూడా పరిశీలించారంటూ అప్పట్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. కానీ డిజైన్లు కూడా ఖరారు చేయలేదు. పథకంపై ఎలాంటి సమాచారం లేదని చేనేత, జౌళిమంత్రిత్వశాఖ అధికారులు స్పష్టంచేశారు. మహిళలకు నెలకు రూ.2500 పంపిణీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కారు అటకెక్కించిందని, చీరల పంపిణీ పథకం పేరుతోనూ మోసం చేశారని మండిపడుతున్నారు.
బతుకమ్మ చీరల పథకం రద్దుతో ఉపాధి కోల్పోయామని నేత కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని బోరుమంటున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో 25 మంది నేత కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం గణేశ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాశాడు. సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని, పరిస్థితిపై సమీక్ష నిర్వహించడం లేదని చేనేత కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.