హైదరాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ): సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ శ్రీశైలం, తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినట్టు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. లేదంటే తెలంగాణకు తీవ్రమైన జల నష్టం తప్పదని స్పష్టంచేశారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం సోర్స్‌ను శ్రీశైలంకు మార్చడాన్ని తప్పుపడుతూ.. ఆంధ్రాకు సద్దిమోసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో గోదావరి, కృష్ణా జలాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చారు.
టెండర్ల రద్దు పాపం కాంగ్రెస్‌దే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలువలు తవ్వలేదన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలపై హరీశ్ స్పందిస్తూ.. మొదట హెడ్‌వర్క్ చేస్తా రా? లేదా తోకపని చేస్తారా? అని ప్రశ్నించా రు. ముందు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చే పంప్‌హౌస్, రిజర్వాయర్ నిర్మించాలని, టన్నెల్, కాలువ తవ్వాలని, ఆ తర్వాత నీళ్లు వచ్చాక పొలాలకు నీళ్లు వదిలే కాలువలు తవ్వాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నా రు. తమ ప్రభుత్వంలో కాలువల తవ్వకాన్ని కూడా ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకోసం రూ.7వేల కోట్లతో టెండర్లు పిలిచామ ని, అగ్రిమెంట్ అయ్యిందని, కాంగ్రెస్ సర్కార్ రాగానే కాలువల అగ్రిమెంట్‌ను రద్దు చేసి రెండేండ్లుగా మళ్లీ టెండర్లు పిలువలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఆ కాలువలన్నీ పూర్తయి కొడంగల్, నారాయణపేట, మక్తల్ ప్రాంతాలకు నీళ్లు పారుతుండేవని చెప్పారు.
నాడు కూడా సబ్జ్యుడిస్లోనే ఉన్నది..
అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా పాలమూరుకు నీళ్లను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ ఒప్పుకున్నారని హరీశ్ తెలిపారు. ఆ అంశం సబ్‌జ్యుడిస్ (కేసులు)లో ఉన్నది కాబటి,్ట ట్రిబ్యునల్ తేల్చే వరకు 45 టీఎంసీలు వచ్చే పరిస్థితి లేదు కాబ ట్టి, 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించుకున్నట్టు సీఎం, మంత్రి చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సబ్జ్యుడిస్లోనే ఉన్నదని చెప్పారు. ఏపీలో జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2022లో 45 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీటితో పాలమూరును చేపట్టారని, అది ఆపాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఐఏ నంబర్ 13/ 2022 కేసు వేశారని చెప్పారు. కేసీఆర్ సర్కార్ గట్టిగా వాదనలు వినిపించడం వల్ల ఏపీ పిటిషన్‌ను కొట్టేసిన ట్రిబ్యునల్.. ఆ 45 టీఎంసీలపై హక్కులను తెలంగాణకు ఇచ్చిందని వివరించారు.
90 టీఎంసీలు కాదు.. 170 టీఎంసీల వ్యూహం
‘పాలమూరుకు కేసీఆర్ ఒకవైపు 90 టీఎంసీల నీటి కేటాయింపులకు ప్రయత్నం చేశారు. వాస్తవానికి కేసీఆర్ ఆలోచన పాలమూరుకు 90 టీఎంసీలు కాదు. 170 టీఎంసీలు వాడాలనే వ్యూహం’ ఉన్నదని హరీశ్ తెలిపారు. ఎలాగూ సెక్షన్-3 అమలవుతుందని, తద్వా రా కృష్ణాలో 1,005 టీఎంసీలను పంచితే.. తెలంగాణకు 600-700 టీఎంసీలు వస్తాయని, ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీలకు అవి జతకూడితే మనకు అవసరమైన నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతోనే పాలమూరుకు 170 టీఎంసీలు కేటాయించాలనే వ్యూహం రచించారు. అయితే, 90 టీఎంసీలతో ఎందుకు ముందుకెళ్లారనే ప్రశ్న రావొచ్చు. ముందుగా అనుమతులు వస్తే.. వేగంగా కాలువలు తవ్వకోవచ్చు, ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్ ముందుకెళ్లారు’ అని వివరించారు..
పాలమూరును పచ్చగా చేసిన బీఆర్ఎస్
‘పాలమూరు కోసం తడ్లాడింది మేం కా దా? కల్వకుర్తిని 30 ఏండ్లు పడుకోబెట్టారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ను కాంగ్రెస్ సర్కార్ పదేండ్లు పండబెడితే, రూ.6వేల కోట్లు ఖర్చు చేసి పాలమూరు జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం. కానీ, 60 ఏండ్లలో కాంగ్రెస్ పాలమూరుకు ఇచ్చింది లక్ష ఎకరాలే. అదీ ఒక్క జూరాల. మైనర్ ఇరిగేషన్లో 2 ల క్షల ఎకరాలు పోయింది. ఆర్డీఎస్లో 87వేల ఎకరాలు పోయింది. ఈ లెక్కన ఇచ్చింది లక్ష.. పోగొట్టింది మూడు లక్షలు. కానీ, కేసీఆర్ వచ్చిన తర్వాత మైనర్ ఇరిగేషన్లో పోయిన 2 లక్షల ఎకరాలను మిషన్ కాకతీయ కింద స్థిరీకరించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా 87 వేల ఎకరాలు సాగులోకి తెచ్చారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ కింద 6.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చారు. ఇలా 10 లక్షల ఎకరాల మాగాణిగా పాలమూరును మా ర్చింది కేసీఆర్.
నువ్వు 2.8 లక్షల ఎకరాలకు పొక్కపెడితే, మేము 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి పాలమూరు వలసలు వాపస్ వచ్చేలా చేసినం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పక్కనపెట్టిందని, నల్లగొండ ప్రజలకు అన్యాయం చేసిందంటూ మంత్రులు చేసిన ఆరోపణలకు హరీశ్ వివరాలతో సమాధానం ఇచ్చారు. కరోనా సమయంలో రెండేండ్లపాటు ఎదురైన ఇబ్బందులను మినహాయిస్తే, ఏడేండ్లలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్‌ను తవ్వినట్టు తెలిపారు. ఇందుకోసం రూ.1,358 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈ టన్నెల్ పూర్తయితే వీటి ద్వారా వచ్చే నీళ్లు దిండి, పెండ్లిపాక రిజర్వాయర్లకు వెళ్తాయి కాబట్టి, రూ.3,892 కోట్లతో ఎస్ఎల్బీసీలో భాగంగా దిండి, పెండ్లిపాక రిజర్వాయర్లను సైతం పూర్తి చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు.
శ్రీశైలం సోర్స్‌ను మార్చింది అందుకే…
నాడు సమైక్యవాదులంతా కలిసి తెలంగాణకు నీళ్లు రావొద్దని, శ్రీశైలం వారికే ఉండాలని, పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ నుంచి అందినకాడికి నీళ్లను లాగేసుకోవచ్చని, తెలంగాణ వాళ్లు ఇందులోకి రావొద్దనే ఆలోచనతో జూరాలలో ఇరికించేశారని హరీశ్ ఆరోపించారు. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన అని మండిపడ్డారు. ఈరోజు కూడా కొందరు సమైక్యవాదుల బానిసత్వం కిందనే ఉండాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా నదిలో తుంగభద్ర ప్రధానమైనదని, తుంగభద్ర నుంచి శ్రీశైలంకు 450-600 టీఎంసీల నీళ్లు వస్తాయని చెప్పా రు. అలాంటప్పుడు తుంగభద్రను మొత్తం ఆంధ్రాకు అప్పగిస్తారా? మన వాటా తెచ్చుకోవద్దా? అని ప్రశ్నించారు.
జూరాల వద్ద తుంగభద్ర కలవదని, ఆ మేరకు మనం నష్టపోయే ప్రమాదం ఉన్నదని వివరించారు. తుంగభద్ర నీళ్లు పొందాలన్నా, 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు. ప్రస్తుతం నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ మోటర్లు ఆగిపోయాయని తెలిపారు. జూరాల కింద యాసంగి పంటకు 5.5 లక్షల ఎకరాలకు క్రాప్‌హాలిడే ఇచ్చిందే రేవంత్‌రెడ్డి ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే శ్రీశైలం పైన ఉన్న కల్వకుర్తి మోటర్లు ప్రస్తుతం గలగల నీళ్లు పారిస్తున్నాయని, ఈ నిమిషానికి యాసంగి పంటలో శ్రీశైలంపైన ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2.8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని చెప్పారు. జూరాల కింద పాలమూరు పెడితే భవిష్యత్తులో మంచినీళ్లకు కూడా దిక్కుండదని చెప్పారు.
అలా చేస్తే.. కేటాయింపులు తగ్గవా?
కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ కోసం రూ.4,350 కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ లిఫ్ట్‌ను భీమాపై పెడుతున్నారని, ఇప్పటికే భీమాకు ఉన్న 20 టీఎంసీల్లో ఉన్న 2 లక్షల ఎకరాలకే నీళ్లు పారే పరిస్థితి లేదని చెప్పారు. వాళ్లకే నీళ్లు తక్కువ ఉన్న పరిస్థితుల్లో అందులో నుంచి కొడంగల్-నారాయణపేట కోసం మరో 7 టీఎంసీలు తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. దీంతో అటు భీమా, ఇటు కొడంగల్ ఆగమైతదని, ఇద్దరి మధ్య కొట్లాటలు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. తద్వారా కృష్ణా ట్రిబ్యునల్ ముందు మనం అడిగే నీళ్ల వాటాలో దెబ్బపడదా? బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వీగిపోవా? రాష్ర్టానికి నీళ్ల కేటాయింపులు తగ్గవా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఏపీ రెట్టింపు నీళ్ల దోపిడీ..
2004-14 వరకు కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం నుంచి ఏపీ వాడుకున్న నీళ్లు 730 టీఎంసీలని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ 1,200 టీఎంసీలు వాడుకున్నదని చెప్పిన మంత్రి ఉత్తమ్‌కుమార్ వాస్తవాలను మాయ చేసే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తమ్‌కుమార్ తన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో 2023-24 వరకే చూపించారని, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో శ్రీశైలం నుంచి ఏపీ తీసుకున్న నీళ్ల లెక్కలు అంతకుమించి ఉన్నాయని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో సగటున ఏడాదికి 120 టీఎంసీలు మాత్రమే ఏపీ తీసుకున్నదని, కానీ నిరుడు 2024-25లో శ్రీశైలం నుంచి ఆంధ్రాకు మళ్లించిన నీళ్లు 241 టీఎంసీలని తెలిపారు. బీఆర్ఎస్తో పోల్చితే రెండింతల నీళ్లు ఏపీ తీసుకెళ్లిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాం లెక్కలు బయటపెట్టిన ఉత్తమ్.. కాంగ్రెస్ హయాం లెక్కలు మాత్రం దాచిపెట్టారని మండిపడ్డారు.
కాంగ్రెస్ చేసింది కట్టుడు కాదు.. కూల్చుడే
2024-25లో 6.55 లక్షల ఎకరాలు, 2025-26లో 5.05 లక్షల ఎకరాల చొప్పున రెండేండ్లలో 11.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో పేర్కొన్నదని హరీశ్ తెలిపారు. కానీ, రెండేండ్లలో లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి మాదిరిగా బీఆర్ఎస్ సర్కార్ సీతారామ ప్రాజెక్టు మొత్తం పూర్తిచేశామని, కేవలం కొద్ది ఖర్చుతో కాలువ లు తవ్వితే సరిపోతుందని చెప్పారు. ఈ పను లు చేయకుండా.. కాంగ్రెస్ ఏం చేసిందంటే.. చెక్‌డ్యాంలు పేల్చుడు, ప్రాజెక్టులు కూలగొట్టుడు, ప్రాజెక్టులు తెగ్గొట్టుడని ఎద్దేవా చేశారు.
అదీ కేసీఆర్ వ్యూహం.. నిబద్ధత
కాళేశ్వరాన్ని తొందరగా పూర్తిచేసి, పాలమూరును పూర్తి చేయాలేదంటూ కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరంలో 968 టీఎంసీల నికర జలాలు ఉన్నందున, అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు తొందరగా వచ్చాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డిలో నీటి కేటాయింపులు లేకపోవడంతోనే ఇబ్బంది ఏర్పడిందని స్పష్టంచేశారు. నీళ్లు, నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్, సీడబ్ల్యూసీ అనుమతులు రావని, అనుమతులు రాకపోతే ఫైనాన్సియల్ అరెంజ్మెంట్ చేయలేమని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ నాటి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తొందరగా పనలు చేసే ప్రయత్నం చేశారని వివరించారు. అదీగాక మన నీటిహక్కులను తెలియజేయాలని, కేఆర్ఎంబీ ట్రిబ్యునల్ వద్ద వాదనలు జరుగుతున్నాయని, ఇప్పటికే పాలమూరుపై రూ.27వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి పాలమూరుకు నీళ్లు ఇవ్వాలని అడిగే హక్కును కల్పించేందుకు పనులు చేశారని హరీశ్‌రావు తెలిపారు. ‘అది వ్యూహం. అదీ కేసీఆర్ నిబద్ధత. పాలమూరుకు నీళ్లు సాధించాలనే నిజాయితీ.
అందుకే కష్టపడి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి నీళ్లు అడిగే హక్కును సృష్టించారు’ అని స్పష్టంచేశారు. దేశ నీటి పారుదల రంగంలో కొన్ని సందర్భాలు ప్రత్యేకంగా ఉంటాయని, ఒక ప్రాజెక్టును పూర్తి చేస్తే అది నిబంధనలకు కొంత అటు, ఇటుగా ఉన్నా ప్రాజెక్టుపై నిధులు ఖర్చు పెట్టారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేస్తాయని పేర్కొన్నారు. అందుకే ‘అనేక ప్రయత్నాలు చేసి కేసీఆర్ ఏడు అనుమతులు తీసుకొచ్చారు. నువ్వు తెలివి తక్కువోనివై మిగిలిన మూడు అనుమతులు తీసుకునిరాలేకపోయావు. అందుకు కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపింది. నువ్వు తెలివి తక్కోవోనివై 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించుకుంటున్నవ్’ అని సీఎంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తే, సీఎం రేవంత్‌రెడ్డికి ఏమాత్రం సోయిలేదని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల నుంచి నిధులు రాకపోవడంతో కాళేశ్వరంలో భాగం చేసి కాశేశ్వరం కార్పొరేషన్‌కు చెందిన రూ.10వేల కోట్లను పాలమూరుపై ఖర్చు చేశారని వివరించారు.హక్కుల కోసం.. మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం
నేరం చేసేది కాంగ్రెస్.. నెపం నెట్టేది బీఆర్ఎస్పైన.. అందుకే ఇంత బాధ కలుగుతున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘నీళ్లులేని చోటు నుంచి నీళ్లు ఉన్న చోటుకు ప్రాజెక్టులను మార్చి, వివాదాలను పరిష్కరించి, నిబద్ధతతో, నిజాయితీతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేయాలని, ఒకవైపు కొత్త ఆయకట్టును సృష్టిస్తూ, మరోవైపు నీళ్లురాని ఆయకట్టును స్థిరీకరిస్తూ.. గోదావరిలో 968 టీఎంసీల నీటి హక్కులను క్రియేట్ చేస్తూ, కృష్ణాలో 299 టీఎంసీలు చాలవు.. 1,005 టీఎంసీలు కావాలంటూ ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగింది’ అని హరీశ్ స్పష్టంచేశారు. గతంలో అసెంబ్లీలో కేసీఆర్ పీపీటీ పెడితే దాన్ని కాంగ్రెస్ అడ్డుకున్నదని, పీపీటీ పెట్టొద్దని, అలాంటి సంప్రదాయం లేదని, ఒకవేళ పీపీ టీ పెడితే బాయ్‌కాట్ చేస్తామని కాంగ్రెస్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, తాను, ప్రశాంత్‌రెడ్డి బీఏసీలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని కోరగా మం త్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు నిరాకరించారని తెలిపారు. అవకాశం ఇవ్వాల్సిందేనని తా ము పట్టుపట్టినట్టు తెలిపారు. ఒకవేళ పీపీటీకి అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజల కోసం అవమానాలైనా భరిస్తామని, మళ్లీ అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే ప్రభుత్వం బండారం బయటపడుతుందని భయపడ్డారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ అవసరమైతే మరో జల పోరాటానికి శ్రీకా రం చుడుతుందని హెచ్చరించారు.
కొడంగల్ ప్రజలకూ సీఎం ద్రోహం
‘పాలమూరు ద్వారా నారాయణపేట కింద కాలువ తవ్వితే గ్రావిటీ ద్వారా 1.17 వేల ఎకరాలకు నీళ్లు పారే అవకాశం ఉంటుంది. కానీ, కాలువను పక్కనపెట్టి లిఫ్ట్ ఏర్పాటు చేసి 16వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలకు సైతం ద్రోహం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలువ తవ్వితే 63వేల ఎకరాలకు నీళ్లు పారే పరిస్థితి ఉంటే, మూడో లిఫ్ట్ పెట్టి 53వేల ఎకరాలకే నీళ్లు ఇస్తానంటున్నారని మండిపడ్డారు. ఇది కొడంగల్ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? రూ.4,300 కోట్లతో కాలువలు పూర్తి చేయొచ్చు కదా? కాలువలు తవ్వకుండా లిఫ్ట్‌లు పెట్టడం వెనుక రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం ఏమిటి? రైతులకు నీళ్లు ఇవ్వడమా? కమీషన్లు నొక్కేయడమా? అని హరీశ్‌రావు నిలదీశారు.
ఏపీ జలదోపిడీ.. (పీఆర్పీ)
9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో 120 టీఎంసీలు మాత్రమే బేసిన్ అవతలికి ఏపీ మళ్లించింది. కాంగ్రెస్ వచ్చాక నిరుడు 241 టీఎంసీలు మళ్లించింది. ఈ ఏడాది నీటి సంవత్సరం ఇంకా 5నెలలు ఉండగానే అప్పుడే 240 టీఎంసీలు ఏపీ మళ్లించింది.
రేవంత్..తల ఏడ పెట్టుకుంటవ్?
రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో రహస్యంగా మాట్లాడి ఆపించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఏపీ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. ఈ ప్రాజెక్టును 2020లో జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీ నుంచి స్టే తీసుకొచ్చి పనులు ఆపించిందని ఏపీ వెల్లడించిందని తెలిపారు. మరి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్.. రేవంత్‌రెడ్డీ..? అని ప్రశ్నించారు. శాసనసభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించినందుకు బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.