హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నగర పాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చతికిల పడింది. రాష్ట్రవ్యాప్తంగా నగర పాలికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి వరకు పూర్తి ఫలితాలను ప్రకటించగా, కీలకమైన కార్పొరేషన్లలో కాంగ్రెస్ చతికిలపడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్నిచోట్ల స్వల్ప మెజారిటీతో గట్టెకినప్పటికీ, మరికొన్ని కీలక నగరాల్లో ‘హంగ్’ పరిస్థితులు తలెత్తడం అధికార పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఇకడ ‘హంగ్’ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజామాబాద్, కరీంనగర్లో పీఠం దకించుకోవ డం కాంగ్రెస్కు కలగా మిగిలింది. ఈ రెండు కార్పొరేషన్లలో బీజేపీకి అవకాశం అధికంగా ఉన్నది. కొత్తగూడెంలో సైతం స్వతంత్రు లు, ఇతర చిన్న పార్టీలు కీలకంగా మారడంతో మేయర్ పీఠం ఎవరికి దకుతుందనేది ఉతంఠగా మారింది. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా హస్తం పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఇక్కడ కాంగ్రెస్ రెబల్స్ బెడద వేధిస్తున్నది. దీంతో అభ్యర్థుల్లోనూ, కార్యకర్తల్లోనూ తీవ్ర ఉతంఠ నెలకొన్నది. పూర్తిగా నిరాశలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మంచిర్యాల, నల్లగొండ, రామగుండం కార్పొరేషన్ల ఫలితాలు కొంత ఊరటనిచ్చాయి.
కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో స్వీప్ చేయలేకపోవడానికి గ్రూపు రాజకీయా లు, టికెట్ల కేటాయింపులో జాప్యం, పట్టణ ఓటర్లలో అసంతృప్తి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో గెలిచినా, ప్రతిష్ఠాత్మకమైన కార్పొరేషన్లలో మాత్రం కాంగ్రెస్ చతికిలపడటం భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ ఫలితాలు అధికార పార్టీకి హెచ్చరిక లాంటివని, మేయర్ పీఠాల దకించుకోవడానికి ‘క్యాంప్’ రాజకీయాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు చెప్తున్నారు.
ఖలీల్వాడి, ఫిబ్రవరి 13: నిజామాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో, గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీ శాయశక్తులా ప్రయత్నాలు చేశాయి. మొత్తం 60 డివిజన్లు ఉండగా, బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 చోట్ల విజయం సాధించాయి. 37వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొందారు. హంగ్ నేపథ్యంలో మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయలక్ష్మి ఇంటికి క్యూకట్టారు. మరోవైపు, విజయలక్ష్మి కుటుంబంలో కీలక వ్యక్తిని కాంగ్రెస్ నేతలు తమ వెంట తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.
