Content Creation | ఎవరైనా ఒక టీనేజర్‌ను నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే చాలా చెబుతారు. ఆ లిస్టులో సోషల్ ఇన్‌ఫ్లూయన్సర్ అని కూడా ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో చాలామంది తమతమ క్రియేటివిటీతో ఇన్ఫ్లూయెన్సర్లుగా రాణిస్తున్నారు. సోషల్ మీడియా, వీడియో, పాడ్‌కాస్ట్ వంటి సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ను రూపొందించడం కీలకం. ఈ కంటెంట్‌ను ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వారు రాసుకుంటారు. కానీ చాలామందికి ఏం రాయాలో ఎలా రాయాలో తెలియదు. ఇక వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) తన వాల్టర్ క్రోంకైట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కంటెంట్ క్రియేషన్‌లో కొత్త డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.
ఏమిటీ కోర్సు
వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ ఎకానమీలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అమెరికాలో ప్రవేశ పెట్టిన మొట్టమొదటి కోర్సు ఇది. ఈ కోర్సు ఏఎస్యూ మాస్ కమ్యూనికేషన్, మీడియా స్టడీస్ డిగ్రీ పాఠ్యాంశాలతో కొంతవరకు పోలి ఉంటుంది. పాడ్‌కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, ఆన్ కెమెరా ప్రెజెన్స్ వంటివి ఐచ్ఛిక అంశాలుగా దీనిలో ప్రధానంగా ఉండటం విశేషం. వీడియో ప్రొడక్షన్, ఆడియన్స్ అనలిటిక్స్ నుంచి సోషల్ మీడియా, స్ట్రాటజీ (Strategy) వరకు కావాల్సిన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పుతారు.
ఇదే మొదటిసారి కాదు
కంటెంట్ క్రియేషన్ అనేది చట్టబద్ధమైన వృత్తి కాదని కొంతమంది వాదిస్తున్నారు. కానీ ఇలాంటి కోర్సులను మొదలుపెట్టడం ఇదే మొదటిసారి కాదని యూనివర్సిటీ పేర్కొంటుంది. కొన్నేండ్లుగా అనేక ఉన్నత విద్యాసంస్థలు కంటెంట్ క్రియేషన్‌పై సర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Programme)లను అందిస్తున్నాయని వెల్లడించింది. సైరాక్యూస్, క్వినిపియాక్, కొలరాడో యూనివర్సిటీలు స్వల్పకాల కోర్సులుగా, సెయింట్ బోనవెంచర్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయని తెలిపింది.
కెరీర్‌కు మార్గాలుగా..
ఇన్ఫ్లూయెన్సర్గా రాణించేందుకు ఇలాంటి ప్రోగ్రామ్‌లు కీలక మలుపును సూచిస్తున్నాయని కార్నెల్ యూనివర్సిటీలోని కమ్యూనికేషన్ ప్రొఫెసర్ బ్రూక్ ఎరిన్ డఫీ అన్నారు. విద్య, ఇతర రంగాల్లోని సంస్థలు కంటెంట్ క్రియేషన్‌ను ఒక కెరీర్ మార్గంగా గుర్తించి ప్రారంభిస్తున్నాయి. సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లుగా ప్రతి చోటా ఉన్నారు. షాపింగ్ మాల్స్, దుకాణాలు, హోటళ్లు, రాజకీయం వంటి వాటికి సంబంధించి ప్రమోషన్ చేయడంలో, జీవనశైలికి చెందిన సూచనలు చేయడంలో కంటెంట్‌ను క్రియేట్ చేసి ప్రసారం చేస్తుంటారు. ఇందుకు వీరికి ఉపాధితో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది. ఇది చాలా సమయం తీసుకునే శ్రమతో కూడుకున్న పని దీనికి జీతం అంటూ ఉండదు. కానీ ఇదొక ప్యాషన్‌గా భావించి ఈ పనిచేస్తుంటారు.

Influencer
అంత సులభం కాదు
సోషల్ మీడియా ఇప్పటికే కిక్కిరిసిపోయింది. ఇంకా పోటీ తీవ్రం కానుంది. ఇలాంటి తరుణంలో కంటెంట్ క్రియేషన్‌లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ దీనిలో రాణించడం అంత ఈజీ కాదు అని ఈ-మార్కెటర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ మ్యాక్స్ విల్లెన్న్ అన్నారు. ఈ ఏడాది అమెరికాలో సోషల్ మీడియా క్రియేటర్ల ఆదాయం 20 బిలియన్ డాలర్లకుపైగా పెరుగుతుందని అంచనా. కానీ ఈ డబ్బులో ఎక్కువ శాతం క్రియేటర్లకు అందడం లేదు. కాబట్టి దీని గురించి క్రియేటర్లు తెలుసుకోవడం ముఖ్యం అని విల్లెన్స్ పేర్కొన్నారు.
నైపుణ్యాలు నేర్పిస్తాయి
కంటెంట్ క్రియేటర్ కల లేని వారిని కూడా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ చేపట్టే ఈ కోర్సు ఆకర్షిస్తుందని ఫీనిక్స్కు చెందిన ఆయేషా బీస్లీ అన్నారు. డిజిటల్ రంగంలో పోటీ పడాలంటే ఏఎస్యూ ప్రవేశపెట్టే కోర్సు విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పిస్తాయని ఆమె వెల్లడించారు. కంటెంట్ క్రియేటర్, యాక్టర్ అయిన సమీ క్రిస్టెర్నా ఈ విషయంపై మాట్లాడుతూ ఏఎస్యూ నుంచి సోషియాలజీ, పొలిటికల్‌సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నాను. కానీ ఆ సమయంలో కంటెంట్ క్రియేషన్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటే ఆ కోర్సు చేసేవాడిని అని అన్నారు. బ్రాండ్ ఒప్పందాలు ఎలా చేసుకోవాలో, ఆదాయ అవకాశాలను ఎలా పెంచుకోవాలో ఈ కోర్సులు ఉపయోగపడతాయని సమీ పేర్కొన్నారు.
జెన్ జీ ఏమంటుంది
మార్నింగ్ కన్సల్ట్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ 2023లో జెన్ జీ (Zen Ze) యవతపై ఒక పరిశోధన చేసింది. దీని ప్రకారం 13 నుంచి 26 ఏండ్ల వయస్సుగల జెన్ జీలో 57 శాతం అవకాశం వస్తే ఇన్ఫ్లూయెన్సర్ అవ్వాలని కోరుకుంటుంది. గత తరం వారు దీనిపై సందేహిస్తున్నప్పటికీ జెన్ జీ కెరీర్ కోసం డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌పై దృష్టి సారిస్తుందని యూనివర్సిటీలు గుర్తిస్తున్నాయి. సైరాక్యూస్ యూనివర్సిటీ గతేడాది క్రియేటర్ ఎకానమీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ అయిన ర్యాన్ ష్రామ్ను డైరెక్టర్‌గా నియమించింది. విద్యార్థులను కంటెంట్ క్రియేషన్, డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలను నేర్పించేందుకు స్వల్ప కాలవ్యవధిగల ఇంటర్ డిసిప్లీనరీ కోర్సును ప్రవేశ పెట్టింది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం
యూనివర్సిటీలు కంటెంట్ క్రియేషన్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇందుకు అరిజోనా యూనివర్సిటీ కొత్త డిగ్రీ కోర్సు ప్రారంభం, సైరాక్యూస్ యూనివర్సిటీ తన కోర్సును విస్తృతం చేసుకునేందకు పెట్టుబడులు పెట్టడమే నిదర్శంనం. జర్నలిజం, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్‌తో పాటు కంటెంట్ క్రియేషన్‌ను కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చుతున్నాయి. క్రియేటర్ ఆర్థిక వ్యవస్థ కాలక్షేపం కోసమే కాకుండా ఒక వృత్తిగా మారిందని యూనివర్సిటీలు పేర్కొంటున్నాయి. అందుకే డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కంటెంట్ క్రియేషన్ కోర్సును అందిస్తున్నామని యూనివర్సిటీలు వెల్లడిస్తున్నాయి. ఇన్‌ఫ్లూయెన్సర్‌ను మించి కంటెంట్క్రియేషన్ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయనడానికి ఈ కోర్సుల ప్రారంభమే నిదర్శనం. ఆకట్టుకునే కంటెంట్ రాసే నైపుణ్యంగలవారికి డిజిటల్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుందని యూనివర్సిటీలు చెబుతున్నాయి.
గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs) ప్రకారం 2027 నాటికి క్రియేటర్ ఎకానమీ సుమారు 480 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది షార్ట్ ఫార్మ్ వీడియో ప్రకటనల ద్వారా అని వెల్లడించింది.

Digital Economy