న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గురువారం పచ్చజెండా ఊపింది. ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంత భారీ స్థాయిలో రక్షణ రంగాన్ని ఆధునీకరించి బలోపేతం చేయడానికి ఆమోదం లభించడం ఇదే మొదటిసారి.
రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ కొనుగోలు ఒప్పందం భారతీయ వైమానిక దళ పోరాట పటిమను ఇనుమడింప చేయనున్నది. ఇందుకోసం రూ. 3.6 లక్షల కోట్లను ప్రభుత్వం వెచ్చించనున్నది. ఇందులో భాగంగా 114 రాఫెల్ జెట్లతోపాటు అమెరికా తయారీ 6 బోయింగ్ పీ8-ఐ నిఘా విమానాలు భారతీయ నౌకా దళానికి సమకూరనున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన నేషనల్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది.