హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ) : నీటిపారుదల శాఖలో నాగర్‌కర్నూల్, నల్లగొండ సీఈ (చీఫ్ ఇంజినీర్ల)ల మధ్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చ రాజేసింది. నాగర్‌కర్నూల్ సీఈ పరిధిలోని ఏదుల రిజర్వాయర్‌ను నల్లగొండ సీఈకి అప్పగించేందుకు సిద్ధమవడమే ఈ వివాదానికి కారణమైంది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. రెండు సర్కిళ్లలోని ఇంజినీర్లు సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు సాగునీటిని అందించే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.6,190 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఏదుల నుంచి టన్నెల్, కెనాల్ ద్వారా కృష్ణా జలాలను డిండి నదిపై ఉల్పర బరాజ్‌కు 1.5 కిమీ ఎగువన నిర్మించబోయే పోతిరెడ్డిపల్లి బరాజ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేలా ప్రణాళికలను రూపొందించారు. మొత్తంగా 4ప్యాకేజీలుగా ఈ పనులను విభజించారు. ఏదుల రిజర్వాయర్ నాగర్‌కర్నూల్ సీఈ పరిధిలో ఉండగా, డిండి లిఫ్ట్ నల్లగొండ సీఈ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం డిండి లిఫ్ట్ ప్రాజెక్టు పనులను నల్లగొండ సీఈ పరిధిలో కొనసాగుతుండగా, నాగర్‌కర్నూల్ సీఈ పరిధిలోని ఏదుల రిజర్వాయర్‌ను ఆయనకే అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. దీనిపై నాగర్‌కర్నూల్ సర్కిల్ ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిండి ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం గత నెల ఈఎన్సీ జనరల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏదులతోపాటు, ఇతర ప్యాకేజీల అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. నాగర్‌కర్నూల్ సీఈకి కనీసం ఈ విషయంపై సమాచారమివ్వకపోవడం, సీఈ లేకుండానే పర్యటించడం వివాదానికి దారితీసింది. దీనిపై నాగర్‌కర్నూల్ సర్కిల్ ఇంజినీర్లు సైతం మండిపడుతున్నారు. ఏదుల రిజర్వాయర్ వాస్తవ నీటినిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 445 మీటర్ల వద్ద 6.59 టీఎంసీలు, 440 మీటర్ల వద్ద 4.16, 437 మీటర్ల వద్ద 3.04, 436 మీటర్ల వద్ద 2.72 టీఎంసీలు. అయితే ఏదుల నుంచి డిండికి, ఎగువన వట్టెం రిజర్వాయర్‌కు 436 మీటర్ల నుంచే నీటిని తరలించేలా తొలుత ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ తాజాగా డిండి రివర్ బెడ్‌లెవల్ 426.37మీటర్లు ఉండగా, ఏదుల నుంచి జలాలను తరలించే బెడ్‌లెవల్ మాత్రం 421.45 మీటర్లు మాత్రమే ఉన్నది. మొత్తంగా 4.9 మీటర్ల వ్యత్యాసం తక్కువ ఉన్నది. ఏదుల నుంచి జలాలను డిండికి తరలించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి డ్రాయల్‌ను 436 మీటర్ల నుంచి 440 మీటర్లకు పెంచాలని ఈఎన్సీ ప్రతిపాదించారు. ఏదులలో 440 మీటర్లకు జలాలను చేరుకున్న అనంతరమే డిండితోపాటు, వట్టెం రిజర్వాయర్లకు జలాలను తరలించాలని ప్రణాళికలను సిద్ధం చేశారు.
నాగర్‌కర్నూల్ సీఈ, సర్కిల్ ఇంజినీర్లు లేకుండా పర్యటించడమే గాక, ఏకపక్షంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల పాలమూరు ప్రాజెక్టు ఆయకట్టుపైనే తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఆయకట్టు మొత్తం వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల కిందనే ఉన్నదని చెప్తున్నారు.