న్యూఢిల్లీ, ఆగస్టు 3: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం వరకు (82.22 కోట్ల షేర్లు) వాటాను అమ్మేస్తున్నది. మంగళ, బుధవారాల్లో ఈ మేరకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) జరుగుతుంది. ఒక్కో షేర్ ధర రూ.382గా ఉన్నది. మంగళవారం నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు, బుధవారం రిటైల్ ఇన్వెస్టర్లకు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. పూర్తి స్థాయి లో షేర్లు అమ్ముడైపోతే ఖజానాకు దాదాపు రూ.31,000 కోట్లు అందుతుందని అంచనా. ‘ఈ ఓఎఫ్ఎస్ ద్వారా 2.5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నది. అలాగే గ్రీన్ షూ ఆప్షన్ కింద అదనంగా మరో 4 శాతం అమ్మకానికి పెడుతున్నారు’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపమ్) కార్యదర్శి అరుణిష్ చావ్లా సోమవారం ఎక్స్‌లో తెలిపారు. బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ విలువ రూ.424.35 వద్ద ముగిసింది.
దీనిపై 10 శాతం రాయితీ ధరకే ఓఎఫ్ఎస్లో ఎల్ఐసీ షేర్లను అమ్మకానికి పెడుతున్నట్టు చావ్లా వివరించారు. ఇదిలావుంటే క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మే 16కల్లా ఎల్ఐసీలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 10 శాతానికి చేరుకోవాల్సి ఉన్నది. ప్రస్తుతం కంపెనీలో కేంద్రం వాటా 96.5 శాతంగా ఉన్నది. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లలోకి పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చినప్పుడు 3.5 శాతం వాటాను అమ్మేసిన విషయం తెలిసిందే. రూ.902-949 ధరల శ్రేణిలో వచ్చిన ఈ ఐపీవో ద్వారా రూ.21,000 కోట్లను కేంద్రం సమీకరించింది. ఎల్ఐసీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.5.36 లక్షల కోట్లుగా ఉన్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం రూ.21,082 కోట్ల నిధులను సమీకరించింది. సూతీ (స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) నుంచి 7 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా, రెమిటెన్స్‌ల నుంచి ఈ నిధులను పొందింది.