మోదీ క్షమాపణ చెప్పేదాకా వదిలేది లేదు
ఊరూరా నల్లజెండాలు.. చావు డప్పు
బైక్ ర్యాలీలు.. దిష్టిబొమ్మల దహనాలు
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప్పుల మోతతో తెలంగాణ గర్జన గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతిధ్వనించింది. తెలంగాణ తెరువొస్తే తెర్లయిపోతరని హెచ్చరించింది.
వేల మందితో బైక్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని చులకన చేస్తూ రాజ్య సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ తీరును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘మోదీ డౌన్ డౌన్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక విధానాలు నశించాలి’, ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
– ఆర్మూర్
బీజేపీ పక్కా తెలంగాణ వ్యతిరేకి
పార్లమెంట్లో ప్రధాని వ్యాఖ్యలతో బీజేపీ పక్కా తెలంగాణ వ్యతిరేక పార్టీ అని నిరూపణ అయ్యింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన బీజేపీ నేతలను రాష్ట్ర ప్రజలు ఉరికిచ్చి కొడుతారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం బీజేపీకి తెలంగాణలో అధికారం కలే. ప్రధాని రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల పోరాటాలను, అమరుల త్యాగాలను తక్కువ చేసేలా మోదీ మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చకుండా రాష్ర్టానికి అన్యాయం చేస్తున్న బీజేపీతో ప్రజలు అప్రమత్తగా ఉండాలి.
– హనుమకొండలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
బీజేపీ పతనం ప్రారంభం
రాజకీయాలు చేయడానికే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చింది. తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయని ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యం. సింగరేణిని అమ్మేందుకు ప్రత్నిస్తున్నది. అదే జరిగితే బీజేపీ పతనం ప్రారంభమవుతుంది.
-సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
తెలంగాణ చరిత్ర తెలుసుకో
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అవమానకర రీతిలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలి. రాష్ట్ర ఏర్పాటుపై 66 ఏండ్లుగా చర్చ జరిగింది. 1956 నుంచి 2014 వరకు స్వరాష్ట్రం కోసం ఉద్యమాలు కొనసాగాయి. ఏపీ నుంచి తెలంగాణను విభజించాలని వందలాది మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం దేశంలోని 35కు పైగా రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అవాకులు, చెవాకులు మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ ఉద్యమాలు, ప్రజల ఆంకాక్షలను ప్రధానికి తెలియజేయాలి.
–నిర్మల్‌లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. గుజరాత్‌ను మించి తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుండటంతో ఆయన కడుపు మండుతున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని ఓర్వలేకపోతున్నారు. కేంద్రం వైఫల్యాలను తెలంగాణ ఎత్తి చూపుతున్నదన్న కారణంతో మోదీ.. ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ర్టాన్ని కించపరుస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు దమ్ముంటే మోదీ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా పదవులకు రాజీనామా చేయాలి.
-ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
మోదీ ప్రధాని కావడం దురదృష్టం
చట్టాలు ఎలా చేస్తారో.. రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండటం దేశ ప్రజల దురదృష్టం. మోదీ వ్యాఖ్యలతో రాష్ట్రంపై బీజేపీ వైఖరి ఏంటో తేటతెల్లమైంది. 60 ఏండ్ల తెలంగాణ పోరాటాన్ని చులకన చేస్తూ మాట్లాడటం మోదీ అహంభావానికి నిదర్శనం. అన్నిరాష్ర్టాల సీఎంలతో మాట్లాడుతున్న కేసీఆర్‌తో తన పదవికి ఎకడ ఇబ్బంది వస్తుందోనని భయపడుతూ మోదీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రం ఇస్తే మీ నాయకులు కండ్లు మూసుకొని మద్దతు ఇచ్చారా?
– ములుగులో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్
ప్రధాని మోదీవి పిచ్చికూతలు
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ పిచ్చికూతలు కూస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాధనలో బీజేపీది రవ్వంత పాత్ర కూడా లేదు. దేశంలో 36 పార్టీల సమ్మతిని కేసీఆర్ కూడగడితే.. గత్యంతరం లేక కాంగ్రెస్, బీజేపీ మద్దతిచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యానికి.. ఎందరో బిడ్డల ఆత్మత్యాగాలకు బీజేపీ, కాంగ్రెస్‌లే కారణం. రాష్ట్ర విభజన బిల్లును అవమానించి మోదీ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. మోదీ రాచరికపు ఆలోచనా విధానానికి గండికొట్టే సాహసం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.
– వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
అమరుల త్యాగాలు అపహాస్యం
తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోదీ 1,200 మంది బిడ్డల త్యాగాన్ని అపహాస్యం చేశారు. ప్రధాని హోదాలో ఉండి తెలంగాణపై విషం కక్కిన మోదీని తెలంగాణ గడ్డ ఎప్పటికి క్షమించదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుతుండటాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసేలా ఉన్నారు. తెలంగాణ ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి.
-కరీంనగర్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్
సొంతంగా ఎదుగుతుంటే ఓరుస్తలేరు
తెలంగాణ సొంతంగా ఎదుగుతుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధికి సహకరించకపోగా, సొంతంగా ఎదుగుతున్న తెలంగాణపై ఏదో ఓ రకంగా విషం చిమ్ముతున్నరు. 14 ఏండ్ల ఉద్యమ కాలంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా ప్రత్యేక రాష్ట్ర సాధించిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. -చాదర్‌ఘాట్‌లో హోంమంత్రి మహమూద్‌అలీ
ఏ ముఖంతో తెలంగాణలో తిరుగుతారు?
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ మరోసారి గాయపరిచారు. రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేండ్లు అవుతున్నా విభజన హామీలను అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమతో విభేదించే రాష్ర్టాలపై వక్రబుద్ధితో వ్యహరిస్తున్నది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దారు. ఇంత అవమానకరంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారు?.
– ఢిల్లీలో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మోదీ తెలంగాణకు శని గ్రహం
తెలంగాణకు మోదీ ఓ శని గ్రహం. రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించిన రోజు బీజేపీకి అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయడు, అరుణ్‌జెట్లీ సభలోనే ఉన్నారు. వారందరి సాక్షిగానే తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించారు.130 కోట్ల మందికి బాధ్యత వహిస్తున్న వ్యక్తి దేశ బడ్జెట్, ఇతర అంశాలను పక్కనబెట్టి ప్రస్తావన లేని రాష్ట్ర విభజనపై మాట్లాడడం సిగ్గు చేటు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రజలు తమకు ఇవ్వాలని అడుగుతారని మోదీకి భయం పట్టుకొన్నది.
-భువనగిరిలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
బీజేపీ కుట్రలు బట్టబయలు
బీజేపీ కుట్రలు పార్లమెంటు సాక్షిగా బట్టబయలు అయ్యాయి. ప్రధాని మోదీ తెలంగాణ ద్రోహి అని తేలిపోయింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ప్రధాని మోదీని ప్రజలు చీదరించుకుంటున్నారు. బీజేపీ నాయకులను గ్రామాల్లో, పట్టణాల్లో నిలదీయాలి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న మోదీ పాలనకు చరమగీతం పాడాలి. -మేడ్చల్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి
చరిత్రను వక్రీకరించేలా వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు చరిత్రని వక్రీకరించేలా మోదీ మాట్లాడటం దురదృష్టకరం. ఎన్నో పోరాటాలు, ఎందరో ఆత్మబలిదానాల ద్వారా సాధించుకొన్న తెలంగాణను అవమానించారు. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందుచూపుతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని సహించలేకనే తెలంగాణపై బురదజల్లేలా మోదీ మాట్లాడారు.
– రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రాజ్యసభలో క్షమాపణలు చెప్పాలి
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టిన రాజ్యసభలోనే మోదీ క్షమాపణలు చెప్పాలి. ఉద్యమాలు, ఆత్మబలిదానాలు, సుదీర్ఘ చర్చలతో సాధించుకున్న రాష్ట్రం గురించి తలుపులు వేసి ఇచ్చారనడం సహించరాని విషయం. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు తెలంగాణ వ్యతిరేకి మోదీని సమర్థించడం విచారకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేవాడా?
-టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల
అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానం
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అవమానం. పార్లమెంట్లో మోదీ చేసిన వ్యాఖ్యలను అదే వేదికగా ఉపసంహరించుకొని జాతికి క్షమాపణ చెప్పాలి. లేదంటే లక్షలాది మందితో వెళ్లి ఢిల్లీని ముట్టడిస్తాం. 1,200 మంది అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణపై మోదీ విషం కక్కుతున్నారు. రాష్ట్రంపై అవాకులు చెవాకులు పేలితే సహించబోం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర మోదీకే సొంతం. ఏపీ, కర్ణాటకకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారు. -మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
అమరుల త్యాగాలను అవమానించేలా ప్రధాని వ్యాఖ్యలు
ప్రజల పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయ్యింది. ప్రజల చిత్తశుద్ధి, విశ్వాసం వల్లే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చాయి. రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా మాట్లాడిన ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సి ఉన్నది. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, అమరవీరుల త్యాగాలను, వారి కుటుంబాలను అవమానించేలా ఉన్నాయి.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత