KTR | హైదరాబాద్, జనవరి 1 : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారత రాష్ట్ర సమితి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 నూతన సంవత్సర సందర్భంగా భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు, తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలి కాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని కేటీఆర్ స్మరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కేటీఆర్ కొనియాడారు.
జెండాను చేతబట్టి నడిపించే నాయకుల కంటే, ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి “ఇది నా జెండా”అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటం వరకు లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తీరుకు వ్యతిరేకంగా, రైతుబంధును రెండు సార్లు ఎగ్గొట్టిన అన్యాయంపై, ‘ఆరు గ్యారంటీలు – 420 హామీలు’పై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను కేటీఆర్ అభినందించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తిన సోదరులను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల ఆక్రమణకు నిరసనగా నిలిచిన విద్యార్థులను, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అన్యాయానికి ఎదురు నిలుస్తున్న తెలంగాణ తమ్ముళ్లను, ఆడబిడ్డలను ఆయన ప్రత్యేకంగా స్మరించారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం మాత్రం శాశ్వతం..
2026వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభసందర్భంలో ఒకటే విషయం గుర్తుంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గెలుపులు, ఓటములు శాశ్వతం కావని, అవి తాత్కాలికమని, అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయని, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతమని స్పష్టం చేశారు.
ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆటలా ఉంటే, తెలంగాణ సాధించిన బీఆర్ఎస్కు రాజకీయాలు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మమని, ఒక విధి అని కేటీఆర్ తెలిపారు. గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలని అన్నారు.
ఈ ఏడాది ఒక వైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే, మరో వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు. పోరాటం, నిర్మాణం రెండింటినీ ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని, ధర్మం, న్యాయం, నిజాయితీ తమవైపే ఉన్నాయని, అందుకే విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్పై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్ఎస్ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. చివరగా 2028లో తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేస్తూ, చిన్నచిన్న ఎదురుదెబ్బలను పెద్దగా పట్టించుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Asaduddin Owaisi: చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించాలి : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
LPG cylinder | కొత్త ఏడాది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర