Sara Arjun | ‘ధురంధర్’… ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్స్’ ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మించి తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోస్తరు అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద గట్టి సందడి చేస్తూ దూసుకుపోతోంది. పాకిస్థాన్ తీవ్రవాదం, భారత్‌పై జరుగుతున్న కుట్రలను రియలిస్టిక్‌గా చూపించిన విధానం కారణంగా ఈ సినిమాపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ‘ధురంధర్’ విడుదలకు నిషేధం విధించారు. సినిమాలో కీలక ఘట్టాల్లో దుబాయ్ సహా గల్ఫ్ దేశాల ప్రస్తావన ఉండటమే ఈ నిషేధానికి ప్రధాన కారణమని బాలీవుడ్ వర్గాలు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.
అయితే అరబ్ దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ, భారత్‌తో పాటు యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. ఈ ఘన విజయం సినిమాలో నటించిన నటీనటులందరికీ ఊహించని స్థాయి పాపులారిటీని తెచ్చిపెట్టింది.ఇక ఈ చిత్రంతో ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తున్నది హీరోయిన్ సారా అర్జున్. రణ్వీర్ సింగ్‌కు జోడీగా నటించిన సారా ఈ సినిమాతో రేర్ ఫీట్ సాధించింది. ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చియాన్ విక్రమ్ నటించిన ‘దైవ తిరుమగల్’ (తెలుగులో ‘నాన్న’) చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సారా, తొలి సినిమాతోనే అవార్డులు అందుకుంది. ఇప్పటివరకు 17 సినిమాల్లో బాలనటిగా నటించిన ఆమె, మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’లో యంగ్ నందినిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు కేవలం 20 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా తొలి చిత్రంతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది సారా అర్జున్. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో హీరోయిన్గా వెయ్యి కోట్ల సినిమా సాధించిన నటిగా ఆమె రికార్డు సృష్టించింది. సాధారణంగా ఈ ఫీట్‌ను హీరోయిన్లు 30 ఏళ్ల వయసులో సాధిస్తే, సారా మాత్రం అది కూడా తొలి సినిమాతోనే సాధించడం విశేషంగా మారింది.సారా అర్జున్ తండ్రి కూడా నటుడే కావడం మరో విశేషం. ఆమె తండ్రి రాజ్ అర్జున్, హిందీతో పాటు తెలుగులో ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించారు. నట వారసత్వంతో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన సారా, ఇప్పుడు హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘యుఫోరియా’ చిత్రంతో 2026లో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్గా పలకరించనుంది సారా అర్జున్.