హైదరాబాద్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు తమ దేశం మధ్యవర్తిత్వం వహించిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) తన సోషల్ మీడియా పోస్టులో స్పందించారు. ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని అన్నారు. భారతీయ హుందాతనాన్ని, సార్వభౌమత్వాన్ని చైనా తక్కువ చేసి మాట్లాడడం సరికాదు అన్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ ఇండోపాక్ మధ్య తీవ్ర సంక్షోభం నెలకొన్నదని, వాణిజ్య బెదిరింపులతో శాంతి నెలకొల్పినట్లు ట్రంప్ చెప్పారని, ఇప్పుడు చైనా మంత్రి కూడా ఇలాంటి ప్రకటన చేయడం భారత్‌ను కించపరచడమే అవుతుందని ఓవైసీ అన్నారు.
చైనా వ్యాఖ్యలను భారత్ బలమైన రీతిలో వ్యతిరేకించాలన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలను ఒకే స్థాయిలో పెట్టి, దక్షిణాసియాలో మేటి దేశంగా మార్కులు కొట్టేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ ఈ విషయాన్నే అంగీకరించారా అని నిలదీశారు. ఇండోపాక్ సమరాన్ని మధ్యవర్తిత్వం ద్వారా ఆపినట్లు చైనా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం అధికారికంగా ఆ వ్యాఖ్యలను ఖండించాలని, మూడవ దేశం జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని చెప్పాలని ఓవైసీ కోరారు.
China wants to place India and Pakistan at the same level and is trying to project itself as a superior in South Asia. Is this what the Modi government agreed to when the PM visited China?
— Asaduddin Owaisi (@asadowaisi) December 31, 2025