Irrigation Projects | ముషీరాబాద్, జూన్ 1 : తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ పరాంకుశం వేణుగోపాల స్వామి అన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం – వర్తమాన పరిస్థితులు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఏపీకి హక్కు లేకున్నా బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలను దోపిడి చేసే కుట్ర చేస్తున్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటిని వినియోగించుకోవానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తూ ప్రాజెక్టులను పడావు పెడుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు కింద 140 టీఎంసీలను వినియోగించుకునే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని, మన సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ పరాంకుశం వేణుగోపాల స్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రభుత్వ చర్యలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకోవాలన్నారు. నీటిపారుదల రంగంలో ఏపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ప్రాంతేతరుల పేర్లు పెట్టడంపై వికాస సమితి ఇప్పటికే నిరసన తెలిపింది అని గుర్తు చేశారు.
మాజీ వీసీ ప్రొఫెసర్ సీతారామా రావు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నది. వ్యవసాయం, పరిశ్రమలు ఇలా ప్రతి రంగం లో సమస్యలు మొదలయ్యాయని ఆరోపించారు. ఏ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇప్పుడు దానికి భిన్నంగా పరిపాలన సాగుతున్నది. ప్రభుత్వం తెలంగాణ చిహ్నాలు మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం కన్వీనర్ పులి రాజు, కన్వీనర్ మియాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు.