హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి సాగునీటి శాఖ పరిధిలోని అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) జల విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని శాఖలోని ఇంజినీర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. నీటి కేటాయింపులు, అనుమతుల సాధన, న్యాయ సంబంధిత సమస్యలు, వాటి పరిష్కారం, పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపులు అంశాల్లో ఈ విభాగమనే కీలకభూమిక పోషిస్తుందని చెప్తున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లో రాష్ట్ర ప్రాజెక్టులకు పొరుగు రాష్ర్టాలు అనేక ఆంటకాలు కల్పిస్తున్నా, ఆయా అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కనీసం దిశానిర్దేశం చేసేవారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో కీలకమైన వాదనలు కొనసాగుతుంటే అవసరమై న నిధులు, సహాయక సిబ్బందిని కూడా సకాలంలో అందివ్వడం లేదని వాపోతున్నారు.
ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సెక్షన్-3 ప్రకారం వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నది. ఆర్డీఎస్ కుడికాలువ పనులను వేగవంతం చేస్తున్నది. గత సంవత్సరం నవంబర్‌లో నాగార్జునసాగర్ డ్యామ్‌ను ఏపీ దౌర్జన్యంగా ఆక్రమించిన నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి శాఖ జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను అక్కడ మోహరించింది. తిరిగి గతంలో తరహాలోనే డ్యామ్ నిర్వహణను తెలంగాణ అజమాయిషీలోకి తీసుకురావాల్సిన అవసరమున్నది.
జల విద్యుత్తుకు సంబంధించిన అంశాలపై, తెలంగాణ చేపట్టిన పలు ప్రాజెక్టులపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుతోపాటు ఇతర వేదికల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పిటిషన్లు దాఖలు చేసింది. మరోవైపు, తుంగభద్ర డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం పడిపోయిందని పేర్కొంటూ నావలి రిజర్వాయర్‌ను విస్తరించేందుకు, అప్పర్‌భద్ర ప్రాజెక్టును చేపట్టేందుకు కర్ణాటక సర్కారు దూకుడుగా వ్యవహరిస్తున్నది.
కృష్ణా, గోదావరి బేసిన్లో పొరుగు రాష్ర్టాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నా తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన దశలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఇంజినీర్లు మండిపడుతున్నారు. కీలకమైన ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుండగా, అందుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అనుభవజ్ఞులైన సాగునీటిరంగ నిపుణులు, న్యాయనిపుణులు కూడా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్‌స్టేట్ విభాగం సీఈ మోహన్‌కుమార్‌కు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ ఢిల్లీకే పరిమితమయ్యారు. రాష్ర్టానికి ప్రాజెక్టుల అనుమతుల సాధనలో భాగంగా కేంద్ర సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరిపేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఒక ఎస్ఈ, ఈఈతోపాటు సపోర్టింగ్ స్టాఫ్‌ను అక్కడ నియమించాలని ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ట్రిబ్యునల్ విచారణలో భాగంగా ప్రతి నెలా ఢిల్లీకి చక్కర్లు కొట్టాల్సి వస్తున్నదని, జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని వెళ్లాల్సి వస్తున్నదని, ఆ నిధులను కూడా ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని ఇంజినీర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంతర్రాష్ట్ర విభాగంపై దృష్టి సారించాలని, ప్రత్యేక అధికారిని నియమించాలని కోరుతున్నారు.
గోదావరి బేసిన్లోనూ అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయి. గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని ఏపీ ఇప్పటికే కేంద్రాన్ని కోరగా, ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. సమ్మక్కసాగర్ బరాజ్‌కు సంబంధించి పొరుగున ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీని తీసుకోవాల్సి ఉన్నది. సీతారామ ప్రాజెక్టుకు అనుమతుల సాధన పెండింగ్‌లోనే పడిపోయింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై జాయింట్ సర్వే చేపట్టాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా ఏపీ సర్కారు పెడచెవిన పెడుతున్నది.
ప్రతిపాదిత సామర్థ్యానికి మించి ప్రాజెక్టు కాలువల తవ్వకాన్ని, దానిపై పలు ఎత్తిపోతల పథకాలను యథేచ్ఛగా చేపడుతున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. త్వరలోనే అన్ని రాష్ర్టాలతో కీలక సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఇటీవలనే కేంద్ర జల్‌శక్తి శాఖ తేల్చిచెప్పింది. గౌరవెల్లి తదితర ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.