హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిరుడు బడ్జెట్ సమావేశాల వేదికగా తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 పాలసీని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పు డా విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. ఆ పాలసీ ద్వారా మొత్తం రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు తీసుకొస్తామని, 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీని విస్మరించింది. అసలు ఆ పథకం కింద ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి ఉన్నదో చెప్పేందుకు పర్యాటక శాఖ అధికారులు వెనక్కి తగ్గుతున్నారు. అసలు ఆ టూరిజం పాలసీ ఎందుకు తీసుకొచ్చారు ? దానిని రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎందుకు ప్రకటించారు? ఆ పాలసీని ఎందుకు అమల్లోకి తేవడం లేదు? అన్న ప్రశ్నలకు ఎక్కడా సమాధానాలు దొరకడం లేదు. ప్రభుత్వం గత ఏడాదిలో తీసుకొచ్చిన టూరిజం పాలసీలో ఐదేండ్లలో రాష్ట్రంలో 15 వేల కోట్ల పెట్టుబడులు తెస్తామని సర్కార్ నమ్మబలికింది. 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు నింపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు. అందుకోసం ప్రైవేటు సంస్థల నుంచి పెట్టబడులు రాబడుతామని భరోసా కల్పించారు.
పర్యాటక రంగం అభివృద్ధికి పెట్టుబడుల కోసమని ఇటీవలే ఏకంగా టూరిజం కాంక్లేవ్ నిర్వహించారు. కానీ, ఆ కాంక్లేవ్ ద్వారా కనీ సం రూ.100 కోట్ల పెట్టుబడులు కూడా రాబట్టలేక పోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తూ గొప్పలకు పోయి రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ప్రైవేటు వ్యక్తుల నుంచి వస్తున్నాయని, ఆ పెట్టుబడులు ప్రతిపాదిత దశలోనే ఉన్నాయని పెద్దలు చెప్పుకొచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అధికారికంగానే విషయాన్ని వెల్లడించారు. మిస్వరల్డ్ పోటీల సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఇలాంటి ప్రగల్భాలే పలికారు. టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులతో అవగాహన ఒప్పందాలు జరిగాయని సీఎం రేవంతే ప్రకటించారు. మరి ఆ మిస్ వరల్డ్ సమావేశం సందర్భంగా చేసుకొన్న ఒప్పందాలు ఏమయ్యాయి? ఇప్పటివరకూ ఎన్ని కోట్ల మేరకు పెట్టబడులు తెచ్చారు? ఎక్కడెక్కడ ఆ పెట్టబడులు పెట్టేందుకు నిర్ణయించారు? అన్న ప్రశ్నలకు చెప్పే దిక్కేలేకుండా పోయింది.
హడావుడిగా తెచ్చిన టూరిజం పాలసీని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందా? ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులు రాబట్టలేక పోతుందా? ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి తేలేక పోతున్నదా? మొత్తంగా చెప్పాలంటే ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలనే అమలు చేయలేకపోతున్న రేవంత్రెడ్డి సర్కార్.. తెలంగాణ టూరిజం పాలసీని పూర్తిగా పక్కన పెట్టిందా? అన్న అనుమానాలపై పర్యాటక ప్రేమికులకు ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.