హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో హరిత ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాలసీని రూపొందిస్తున్నది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. సం బంధిత ముసాయిదాపై శుక్రవారం సంబంధిత భాగస్వాములు, వాటాదారులతో సంప్రదింపులు జరిపింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హాజరయ్యా రు. సీఐఐ, ఫిక్కీ, ఎన్టీపీసీ, ఎఫ్టీసీసీఐ, సోలార్ ఎనర్జీ అసొసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చించారు.
గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెం చేందుకు రాష్ట్రంలో ప్లోటింగ్ సోలార్, వేస్ట్ టు ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను నెలకొల్పుతారు. ఈ 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీలో సింగరేణి సంస్థ 5 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, గ్రీన్ ఎనర్జీ పాలసీని మంత్రివర్గం ఆమోదించిన తర్వాత తుది పాలసీని ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు కోసం లీజుకు ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసొసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.