గంభీరావుపేట, మే8: మంత్రి కేటీఆర్ కృషితో మధ్యమానేరు రిజర్వాయర్లో రూ.1300 కోట్లతో 367 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరమని ముదిరాజ్ మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం లింగన్నపేటలో సోమవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సింహ గర్జన నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలిపిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని కొనియాడారు. ఆక్వాహబ్తో సుమారు 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.