కరీంనగర్ కలెక్టరేట్, జూలై 8: అధికారుల నిర్లక్ష్యంతో తనకున్న రెండెకరాల భూమి ధరణిలో నమోదు కాకపోగా, ఇదేంటని అడిగితే ఉల్టా బెదిరిస్తున్న అధికారుల తీరుతో విసుగు చెందిన ఓ పేదరైతు జంట పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది. తన భూమిని ఇతరులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, దానిని పరిశీలించి తన పేర నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి చెందిన ఒగ్గు రాజమల్లు కొద్దికాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
ప్రశ్నిస్తే ఉల్టా కేసులు నమోదుచేయిస్తామంటూ బెదిరించడంతో రాజమల్లు, తన భార్యతో కలిసి పురుగుల మందు డబ్బాతో కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చాడు. పోలీసులు తనిఖీ చేస్తుండగా, సంచిలో పురుగుల మందు డబ్బా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అధికారులు తమ భూమిని ఇతరుల పేర్లపై ధరణిలో నమోదు చేసిన వివరాలు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకుంటే ప్రజావాణిలోనే పురుగుల మందు తాగుదామని నిర్ణయించుకుని వెంట తెచ్చుకున్నట్టు వెల్లడించారు. పురుగుల మందు డబ్బా స్వాధీనం చేసుకుని, కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేయించారు.