హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో పదోన్నతుల పండుగ అతిత్వరలో ప్రారంభం కానున్నది. తాజా సమాచారం ప్రకారం 9,178 మందికి పదోన్నతులు దక్కే అవకాశమున్నది. వీరిలో ప్రధానోపాధ్యాయులుగా 1,771 మంది, స్కూల్‌అసిస్టెంట్లుగా 6,627 మంది, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లుగా 67 మంది, పీజీటీలుగా 260 మందికి ప్రమోషన్లు దక్కే చాన్సు ఉన్నది. కొత్త జిల్లాల ప్రకారం జూలై 15 నాటికి క్యాడర్‌ను విభజించి, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తాజాగా తాము సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిగా& ఇందుకు ఆయన అంగీకరించినట్టు ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. విద్యాశాఖలో మొత్తం 9,579 మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉన్నది. వివిధ హోదాల్లో ఇప్పటికే 405 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. 9,034 పోస్టులకు డీపీసీ లేకుండా, మరో 151 పోస్టులకు డీపీసీలు ఏర్పాటుచేసి పదోన్నతులు కల్పించాల్సి ఉన్నది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గత జనవరిలోనే పదోన్నతుల కోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రెండు అంశాలపై స్పష్టతలేకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏజెన్సీ పోస్టులు అక్కడివారితో భర్తీచేయాలన్న జీవోను గతంలో కోర్టు కొట్టేసింది. ఈ జీవోను పాటించడమా.. లేదా అనే విషయంతోపాటు, పాత 10 జిల్లాలా.. లేదా 33 జిల్లా జిల్లాల ప్రకారం పదోన్నతులు కల్పించాలా అనే అంశాలపై స్పష్టతలేకపోవడంతో ప్రక్రియను నిలిపివేశారు. కొత్త జిల్లాలు, జోన్ల ఫైలు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండటంతో దాదాపు పాత జిల్లాల ప్రకారమే చేపట్టాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో ఇటీవలే కేంద్రం కొత్త జిల్లాలు, జోన్లకు అంగీకారం తెలుపడం, గెజిట్‌ను విడుదలచేయడంతో పూర్తి స్పష్టతవచ్చింది. దీంతో కొత్త జిల్లాల ప్రకారం క్యాడర్ విభజన, పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు త్వరలోనే తెరలేవనున్నది.
కొత్త జిల్లాల ప్రకారమే విద్యాశాఖలో క్యాడర్ విభజన పూర్తిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశారు. పలు ఉపాధ్యాయ సమస్యలతోపాటు పాఠశాలల పునఃప్రారంభంపైనా వినతిపత్రాన్ని సమర్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల ప్రతిపాదనను వాయిదావేసి, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని, 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని కోరారు. వీటిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు నాయకులు తెలిపారు.