హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏపీ ప్రజల కోసం ఉమ్మడి కోటా నుంచి నీళ్ల వాటాను కేసీఆర్ ఎందుకు అడగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలు హైదరాబాద్ నిధుల్లో వాటా కావాలంటూ ఏపీ చేస్తున్న డిమాండ్‌కు అనుకూలంగా ఉన్నాయని నిప్పులు చెరుగుతున్నారు.
ప్రజాభవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 20శాతం మంది ఏపీ ప్రజలు ఉంటున్నారని, వారి తాగునీటి అవసరాల కోసం ఉమ్మడికోటా నుంచి జలాలను తీసుకుంటామని అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో ఏనాడూ కేసీఆర్ అడగలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, నీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇక్కడ ఉన్నవాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ చెప్పడమేగాకుండా, పదేండ్ల పాటు అలాంటి పాలనే అందించారని గుర్తుచేశారు.
ఇతర రాష్ర్టాల వారు అనేకమంది హైదరాబాద్‌లో నివాసముంటున్నారని, వారంతా తమ సొంత రాష్ర్టాల నుంచే నీటి వాటాలను తెచ్చుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని ఏపీ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నదని, కేంద్రానికి లేఖలు రాసిందని గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి కోటాలో నీటివాటాను కోరితే రేపటి రోజున హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటాను కూడా ఇవ్వాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.