హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): 1956లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఏపీతో హైదరాబాద్ స్టేట్‌ను విలీ నం చేయడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని, గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకునే అవకాశాన్ని కోల్పోవడంతో లిఫ్ట్ పథకాలపై ఆధారపడాల్సిన అగత్యం ఏ ర్పడిందని తెలంగాణ అధికారులు బ్రిజేశ్ కు మార్ ట్రిబ్యునల్‌కు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై శుక్రవారం ఢిల్లీలో ట్రిబ్యునల్ విచారణ కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ తన వాదనలను కొనసాగించింది. చారిత్రకంగా తెలంగాణకు జరిగిన నష్టంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే అంశాలను ట్రిబ్యునల్ కు తెలియజేసింది. 1956లో జరిగిన రాష్ట్రా ల పునర్వ్యవస్థీకరణ వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లిందని, గ్రావిటీ ద్వారా 174.3 టీఎంసీల నీటి వినియోగానికి హైదరాబాద్ స్టేట్ రూపొందించిన ప్రణాళికలన్నీ చెదిరిపోయాయని పేర్కొన్నది.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేసిన అక్రమాలను మ్యాప్‌ల సహాయంతో వివరించింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ), కల్వకుర్తి, నెట్టంపా డు, పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ప్రా జెక్టులకు 75% డిపెండబిలిటీ కింద నీటిని ఎలా కేటాయించాలో తెలిపింది. ఆల్మట్టి డ్యా మ్ ఎత్తును, స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 60 టీఎంసీలను వినియోగించుకునేందుకు కర్ణాటక అవకాశామిచ్చినప్పటికీ ఉమ్మ డి ఏపీ ప్రభుత్వం ససేమిరా అన్నదని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే ఆ 60 టీఎంసీల ప్రయోజనం చేకూరేదని, ఆల్మట్టి నుంచి గ్రావిటీ కాలువల ద్వారా నీరు వచ్చేదని వివరించింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 5.4 లక్షల ఎకరాలకు కుదించిందని తెలిపింది. పీఆర్ ఎల్ఐఎస్, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టుల్లో రూ పొందించిన స్టోరేజీ రిజర్వాయర్ల గురించి సైతం ట్రిబ్యునల్‌కు వివరించింది.
ఆగస్టు 28కి వాయిదా
ఢిల్లీలో మూడు రోజులుగా కొనసాగిన ట్రిబ్యునల్ విచారణ శుక్రవారంతో ముగిసిం ది. తెలంగాణ వాదనలన్నీ ఈ సెషన్లోనే వినిపించాల్సి ఉన్నది. సవివరంగా వాదనలు వినిపించేందుకు మరో 2 రోజులు గడువు కావాలని తెలంగాణ కోరింది. దీంతో తెలంగాణ తుది వాదనలను వినిపించేందుకు అవకాశమిచ్చిన ట్రిబ్యునల్.. తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.