Telangana Decade Celebrations | ప్రతి పథకమూ ఆదర్శం.. రూపకల్పనలో వినూత్నం.. అమలులో విప్లవాత్మకం
ఎట్లుండె తెలంగాణ..
సంక్షేమం అంటే తెల్వదు..
చేతివృత్తులు చేజారినయ్..
సబ్బండ వర్గాలు చచ్చుబడ్డయ్..
పొద్దులు వడ్డంక పోయిన పానాలు..
చేతిలో పసిగుడ్డుల మరణాలు..
ఊరూరా జీవన విధ్వంసమే..
ఇప్పుడెట్లున్నది తెలంగాణ..
బడుగులు బాగుపడ్డరు..
బలహీనులు బలవంతులైనరు..
ముసలోళ్లకు ఆసరా అందుతున్నది..
అభాగ్యులకు ఆర్థిక భరోసా కలుగుతున్నది..
సంక్షేమం పరుగులు పెడుతున్నది..
దేశం తెలంగాణను అనుకరిస్తున్నది!
Kcr Nutrition Kit
హైదరాబాద్: బతుకు అంటేనే దుర్భరం అన్న రోజుల నుంచి సంక్షేమం అంటే ఇదే అన్న స్థితికి చేరింది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం రూపకల్పనలో వినూత్నమైనది, అమలులో విప్లవాత్మకమైనది. ప్రతీది పేదల అభ్యున్నతికి తీసుకొచ్చిందే. పథకాల రూపకల్పనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మార్కు చూపించారు. దిక్కులేనివాళ్లకు దిక్కైండు. ఆడపిల్ల పెండ్లికి మేనమామ అయ్యిండు. ఒంటరి మహిళకు అన్నలా మారిండు. గురుకుల విద్యార్థులకు గురువైండు. వలసెల్లిన బిడ్డలను వేలుపట్టుకొని ఊరికి తోలుకొచ్చి, పడావుబడ్డ పల్లెల్లో పచ్చని జెండా అయి ఎగిరిండు. మొత్తంగా తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా మార్చుతున్నరు. తెలంగాణ ప్రభుత్వ తొలి నాలుగున్నరేండ్ల పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడ్డది. ఆసరా పింఛన్ల నుంచి మొదలు అన్ని రంగాల్లో సంక్షేమం ఆకాశమంత విస్తరించి దేశానికే దిక్చూచిగా నిలుస్తున్నది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్ల పంపిణీ, చేపల పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను బడుగుబలహీన వర్గాలకు అమలు చేస్తున్నది. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక గత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, దేశంలో ఎవరికీ సాధ్యం కాని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఎస్సీల అభివృద్ధి కోసం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. షరతులు లేకుండానే స్వయం ఉపాధి కల్పించేలా రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తున్నది. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు తదితర పథకాలకు శ్రీకారం చుట్టింది. వైన్‌షాపుల్లో ఎస్సీలకు, గౌడ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా గౌడ కులస్థులే నీరా తీయడం, విక్రయం చేయాలని నీరా పాలసీ రూపొందించింది. 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను కేటాయించడంతోపాటు, భవన నిర్మాణానికి రూ.కోటి చొప్పున నిధులను కేటాయించింది. ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది.
Aasara
ప్రతి పైసాకూ ప్రతిఫలం
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చేస్తున్న ప్రతి పైసాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతిఫలం దక్కుతున్నది. ఆసరా పింఛన్లతో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దక్కడంతోపాటు, కుటుంబంలోనూ ఆదరణ పెరిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడింది. మాతా శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది. గొర్ల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గతంతో పోల్చితే 22 శాతం పెరిగింది. చేపల ఉత్పత్తిలోనూ దూసుకుపోతున్నది. గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యాభివృద్ధిలో నవశకం మొదలైంది. డ్రాపౌట్స్ తగ్గి, ఉన్నత చదువులు చదివే బాలికల సంఖ్య పెరిగింది. మైనారిటీ బాలికల విద్యలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా నిలవటం గర్వకారణం. దళితబంధు నిరుపేద దళితుల్లో కొత్త కాంతులను నింపుతున్నది. కూలీలను ఓనర్లుగా మార్చుతున్నది. ఒక్కటని కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం ఆశించిన స్థాయికి మించి సత్ఫలితాలను ఇస్తున్నది. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మాడల్‌గా నిలుస్తున్నది.
ఇంతకన్నా సంతృప్తి ఏముంటది?
పిల్లల నిరాదరణకు గురైన వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఇలా ఎందరో ఇబ్బందుల్లో ఉన్నరు.
వాళ్ల అవసరాలు తీర్చేలా పెన్షన్ ఇస్తే అర్థం, పరమార్థం ఉంటదని 2014లో వెయ్యి రూపాయల పెన్షన్ ఇయ్యాలని నిర్ణయించినం. రాష్ట్రం పరిస్థితి బాగైతే దాన్ని పెంచుకుందామని అనుకున్నం. ఇప్పుడు రెండింతలు చేసి 2,016 ఇస్తున్నం. ‘రూ.2,016 పింఛన్ వస్తుంది. మంచిగ బతుకుతున్నం బిడ్డ’ అని చాలామంది చెబుతున్నారు. ఇంతకన్నా సంతృప్తి ఏముంటది!
-ముఖ్యమంత్రి కేసీఆర్