హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎగిసిన నిరుద్యోగ ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నా హోరెత్తింది. గ్రూప్-1లో 1:100 నిష్పత్తి, మెగా డీఎస్సీ విడుదల, గ్రూప్ 2, 3లో పోస్టుల పెంపుపై కాంగ్రెస్ మాటిచ్చి తప్పిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే డీఎస్సీ పరీక్షలు రద్దు చేయాలని ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారు. రాష్ట్రంలో నమ్మి కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమను నిండా ముంచిందని నిప్పులుచెరిగారు. ‘రేవంత్‌రెడ్డి హటావో.. తెలంగాణ బచావో’ అని పెద్దపెట్టున నినదించారు. ధర్నాలో నిరుద్యోగులు రమేశ్, బాలరాజు, ప్రకాశ్, అనిత, మోహన్, గోపి, అనిల్, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తాం ..
తమ డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకుంటే రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్ తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యేదాకా ఢిల్లీలోనే ఉండి పోరాటం చేద్దామని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీని వీడేది లేదని, ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు .
ఇవీ డిమాండ్లు