హైదరాబాద్ : తెలంగాణ(Stri Nidhi)లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(Minister Errabelli)అన్నారు. స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని శిల్పారామం(Shilparamam)లో జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1. 59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల సంఘ సభ్యులు స్త్రీ నిధి నుంచి రుణాలు పొందారని తెలిపారు. స్త్రీ నిధి రుణాల నిలువ ప్రస్తుతం రూ.5,355 కోట్లని,రుణాల నిలువలో 28.20 శాతం వృద్ధి సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.రాజస్థాన్(Rajastaan) లాంటి రాష్ట్రాలు మన స్త్రీ నిధి ని అమలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలను విడుదల చేసిందని పేర్కొన్నారు.
మహిళలు సోలార్ విద్యుత్(Solar power) ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని, దీంతో ఖర్చులు తగ్గుతాయని వెల్లడించారు. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నారు.మండల సమాఖ్య కాలపరిమితి మూడు సంవత్సరములకు పెంచాలని అధికారులకు సూచించారు. సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ అంశాన్ని పరిశీలించాలని తెలిపారు.
స్త్రీ నిధి కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు అధికారులు, ఉద్యోగులకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు.ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, స్త్రీ నిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఏపీ మాస్ అధ్యక్షులు సీఎస్ రెడ్డి, స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, స్త్రీ నిధి ఉపాధ్యక్షులు రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, మేనేజింగ్ కమిటీ సభ్యులు, డీఆర్డీవోలు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.