హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా మరో రూ.9,000 కోట్ల భారీ రుణం కోసం భారత రిజర్వు బ్యాంకుకు ఇండెంట్ పెట్టడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలకు, క్షేత్రస్థాయిలో చేస్తున్న అప్పులకు పొంతన కుదరడం లేదు. ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్న రుణ లక్ష్యం రూ.54,009 కోట్లను అర్ధ వార్షికంలోనే చేరుకున్నది. జనవరి నాటికే అప్పుల భారం రూ.71,800 కోట్లకు చేరింది. అంటే అంచనా వేసిన దానికంటే ఇప్పటికే 30 శాతానికిపైగా అదనపు భారం పడింది.
10 నాటికి మొత్తం రుణం 80,800 కోట్లు
రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపిన తాజా ప్రతిపాదనల ప్రకారం ఫిబ్రవరి 10న జరగబోయే వేలం ద్వారా రూ.9,000 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. 13 ఏండ్ల కాల పరిమితితో రూ.2,000 కోట్లు, 16 ఏండ్ల కాల పరిమితితో మరో రూ.2,000 కోట్లు, 21 ఏండ్ల కాలానికి రూ.2,500 కోట్లు, 27 ఏండ్ల కాల పరిమితితో మరో రూ.2,500 కోట్లు తీసుకుంటామని, ఇందుకు అవసరమైన సెక్యూరిటీ బాండ్లు పెడతామంటూ తెలంగాణ ఆర్థికశాఖ ప్రతిపాదనలు పంపించినట్టు ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, నాలుగో త్రైమాసికం (క్యూ-4)లో ఇప్పటికే సేకరించిన రూ.3,500 కోట్లకు ఇది అదనం. ఈ కొత్త రుణాన్ని కూడా కలిపితే, ఈ ఏడాది మొత్తం అప్పుల భారం రూ.80,800 కోట్లకు చేరుకుంటుంది. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమై, కేవలం అప్పులపైనే ఆధారపడటం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.