Spices | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : మిర్చి, పసుపు సాగులో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. నిత్యం వంటింట్లో వినియోగించే చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర తదితర 11 రకాల మసాలా దినుసులకు కొరత ఏర్పడింది. చివరికి చింతపండును కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొంది. సరైన పంటల ప్రణాళికలను రూపొందించకపోవడంతో ఏండ్లు గడుస్తున్నా దిగుమతులు తగ్గడం లేదు. దీంతో రైతుల ఆదాయాలు తగ్గడంతో పాటు ప్రజలకు ధరల భారం తప్పడం లేదు.
నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు ఎక్కువగా సాగవుతోంది. 56 వేల ఎకరాల్లో 1.74 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతున్నట్టు ఉద్యాన శాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నా యి. రాష్ట్రంలో రోజువారీ పసుపు వినియోగం 56.25 టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు 23 వేల టన్నులు సరిపోతుంది. మిగితా పసుపు ఎగుమతి అవుతున్నది. మిరప ఉత్పత్తిలో ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 2.78 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. దీంతో ఏటా 5.73 లక్షల టన్నుల ఎండు మిర్చి ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్రంలో రోజువారీగా కారం వినియోగం 93 టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడేది 39 వేల మెట్రిక్ టన్నులు. మిగతా 5.34 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నారు.
లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, జీలకర్ర వంటి విలువైన సుగంధ ద్రవ్యాలను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెలంగాణ దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. వాటితోపాటు ప్రస్తు తం చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలను కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఏటా 61,564 టన్నుల చింతపండును దిగుమతి చేసుకొంటున్నారు. 47,930 టన్నుల అల్లం ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నది. వెల్లుల్లి 148 టన్నుల ఉత్పత్తి అవుతుండగా రాష్ట్రంలో వినియోగం మాత్రం 39,417 టన్నుల మేర ఉంటోంది.
రాష్ట్రంలో రోజూ సగటున ఒక్కొక్కరు 21.21 గ్రాముల సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తారు. ఇలా ఏటా 2.63 లక్షల టన్నులు అవసరమవుతాయి. చింతపండు,అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు లాంటి 11 సుగంధ ద్రవ్యాలు 1.78 లక్షల టన్నులు అవసరమవుతాయి.