హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆస్తులను ఆంధ్రా పాలకులు తమ అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్, చుట్టుపక్కల హౌజింగ్ బోర్డు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపట్టి, విక్రయించింది. కానీ బోర్డులోని అవినీతి అధికారులు కంపెనీలతో కుమ్మక్కు కావడంతో భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా హౌజింగ్ బోర్డు నిండా మునిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీటిని స్వాధీనానికి, సంరక్షించేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. ప్రస్తుత సర్కారు ఆదాయం కోసం భూముల అమ్మకానికి సిద్ధమైంది.
2007లో డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఏర్పాటైంది. టౌన్షిప్లు, జాయింట్ వెంచర్ ప్రాజక్టులు చేపట్టే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. దిల్ కింద తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 6,800ఎకరాల భూములు, విశాఖలో 150ఎకరాల భూములు ఉండేవి. 1890ఎకరాలు ప్రాజక్టులకు వినియోగం, విక్రయం జరగగా, 5000ఎకరాలు దిల్ ఆధీనంలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో జీఓ ద్వారా వెనక్కు తీసుకుంది. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. భూము లు తెలంగాణలో ఉన్నందున ఏపీకి ఎటువంటి హక్కులు ఉండవని తెలంగాణ వాదించింది. ఈ భూముల విలువ రూ.70వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
అన్యాక్రాంతమైన హౌసింగ్ బోర్డు భూములను తిరిగి దక్కించుకునేందుకు గతంలో బీఆర్ఎస్ సర్కారు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూముల సంరక్షణకు పూనుకున్నది. భూములకు ప్రహరీగోడల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని, అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు రచించింది. ఇప్పటికే గుర్తించిన భూములకు 28వేల మీటర్ల పొడవున ప్రహారీ గోడలు నిర్మించారు. భూముల స్వాధీనంలో అధికారులు పోలీసుల సాయం తీసుకుంటున్నారు.