తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనమందరం నిలబడి ఉన్నామంటే అది కేవలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భిక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖైరతాబాద్‌లోని బడా గణేశ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక ప్రాంతం జనాభా తక్కువగా ఉన్నా ఆ ప్రాంత ప్రజల కోరిక న్యాయబద్ధమైతే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆ రాష్ట్ర అసెంబ్లీతో పని లేకుండా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చని ఆయన ఆర్టికల్ -3లో పొందు పరిచారని గుర్తు చేశారు. అంబేద్కర్ పొందుపరిచిన ఆ క్లాజు లేకుండా ఏ నాటికి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వేరుకాకుండేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన కొద్దికాలానికే దేశంలోనే నంబర్ వన్ గా నిలబడ్డామని తెలిపారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో మనమందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నామని.. ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను అతిథిగా పిలిచి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ రోజు ఓబీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అందుకు కారణం బీపీ మండల్ అని, ఆయన మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ఈ రోజు మన కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
అంబేద్కర్ ది ఉక్కు సంకల్పం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ది ఉక్కు సంకల్పమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆయనను ఎన్ని కష్టాలకు గురి చేసినా వెనక్కి తగ్గలేదని.. విదేశాలకు వెళ్లి ఉన్నత ఉద్యోగం చేస్తూ వివక్ష లేకుండా మహరాజులా బతికే అవకాశమున్నా వెళ్లలేదన్నారు. తాను ఒక్కడిని పక్కకు జరిగితే తన జాతి ప్రజలపై జరుగుతోన్న వివక్ష, అణచివేత కొనసాగుతూనే ఉంటుందని.. వాటిని తొలగించాలన్న ఉక్కు సంకల్పంతో పని చేసిన మహనీయుడు ఆయన అని కొనియాడారు. అంబేద్కర్ ఒక్క దళితులకు మాత్రమే దేవుడు కాదని ఓబీసీలు, మహిళల హక్కుల కోసం పాటు పడ్డ మహావ్యక్తి అన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన గొప్ప మనిషి అన్నారు. భారత రాజ్యాంగం రాసే క్రమంలో ఆయన గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారని.. ఆ రోజు మన దేశంలో అంబేద్కర్ కన్నా ఎక్కువ చదువుకున్న, లోకజ్ఞానం, ప్రపంచ జ్ఞానం తెలిపిన వ్యక్తి ఇంకొకరు లేకుండేనని గుర్తు చేశారు. అందుకే ఆయనకు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారని.. దానికి ఆయన న్యాయం చేసి ప్రపంచంలోనే లోతైన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారని తెలిపారు.
కవితతో బీపీ మండల మనవడి భేటీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఆమెతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. బీసీ ఉద్యమంపై ఇద్దరు చర్చించారు. బీసీల కోసం కవిత చేస్తున్న కృషిని సూరజ్ మండల్ కొనియాడారు. కవిత పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన కృషిని అభినందించారు. అనంతరం సూరజ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత జీవేకే ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.