హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేడు(గురువారం) విడుదల కానున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించకపోవడంతో మార్గం సుగమమైంది. దీంతో గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. గత నెల 29న షెడ్యూల్ను ప్రకటించింది. కాగా మొదటి దశలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇందుకు అనుగుణంగా 31 జిల్లాల కలెక్టర్లు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.
పరిషత్ ఎన్నికలను రెండు విడతల్లో, పంచాయతీ (సర్పంచ్) ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 9న ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ముగియన్నుదని ప్రకటించింది. రాష్ట్రంలోని 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడుతల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 23న, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలివిడతకు అక్టోబర్ 9న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 11న ముగిస్తుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే రెండో విడత పరిషత్ ఎన్నికలకు అక్టోబర్ 13న నామినేషన్ స్వీకరణ ప్రక్రియను మొదలు పెట్టి అక్టోబర్ 15న ముగిస్తారు. అక్టోబర్ 16న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. అక్టోబర్ 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న రెండు విడతలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 12,733 సర్పంచులు, 1,12,288 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతకు సంబంధించి అక్టోబర్ 17న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్ 19న ముగిస్తారు. అక్టోబర్ 20న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 31న ఉదయం పోలింగ్ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రెండో విడతకు సంబంధించి.. అక్టోబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 23 వరకు ముగిస్తారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24న నిర్వహిస్తారు. అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 4న ఉదయం ఎన్నికలు నిర్వహించి అదేరోజూ ఫలితాలు వెల్లడిస్తారు. మూడో విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 25న మొదలై అక్టోబర్ 27న ముగుస్తుంది. అక్టోబర్ 28న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 31 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. నవంబర్ 8న ఉదయం పోలింగ్ నిర్వహించి అదేరోజూ మధ్యాహ్నం తర్వాత ఓట్ల్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సంబంధించిన విధివిధానాలపై అన్ని సూచనలు ఇచ్చి, ఏర్పాట్లపై వారితో ఈ సందర్భంగా చర్చించారు. పోలీస్ బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్ పేపర్లు సహా పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు.