హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది. అందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ పార్టీలు మాత్రమే ఉన్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నాయి. వారికి మాత్రమే ఆయా పార్టీల గుర్తులు దక్కనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేవారికి ఇతర గుర్తులను (ఫ్రీ సింబల్స్) ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ముద్రించి అందిస్తుంది. ఎస్ఈసీ ఆదేశం మేరకు ఓటర్ల జాబితాను అందించేందుకు జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వార్డులవారీగా సోమవారం నుంచే పార్టీల జిల్లా అధ్యక్షులకు ఒక సెట్ ఫొటోతో కూడిన తుది ఓటరు జాబితాను అందించనున్నారుఅందించనున్నారు.