మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పాలకవర్గం కొలువుదీరడంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజారిటీ వచ్చిన ఆయా పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంప్‌లకు తరలించారు. కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్చైర్మన్ల ఎంపిక తలనొప్పిగా మారింది. మహబూబ్‌నగర్ తొలిమేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో మరికొద్ది గంటల్లో తేలనున్నది. ఇదిలా ఉండగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, అయిజతోపాటు వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టనున్నది.
ఈ మూడు చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. అలంపూర్ మున్సిపల్ చైర్మన్‌గా పి.జయరాములు, అయిజ మున్సిపల్ చైర్మన్‌గా సీఎం రమేశ్ దాదాపుగా ఖరారయ్యారు. అమరచింతలో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకోనున్నది. సోమవారం ఉదయం 11గంటలకు కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లుకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపడుతారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ప్రత్యేక సమావేశాలకు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త పాలకవర్గం కొలువుతీరనుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ పాగా..
ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలోని కార్పొరేషన్‌తోపాటు 18మున్సిపాలిటీలకు జరిగిన హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. చాలా మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్లో ఢీకొనలేక చేతులెత్తేశారు. అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, అయిజ మున్సిపాలిటీలతోపాటు మొత్తం నియోజకవర్గంలోని అమరచింత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాగ వేయనున్నది. గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు కీలకంగా మారారు. గద్వాలలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ గెలిచిన స్థానాన్ని రీకౌంటింగ్ చేయించి తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక నారాయణపేటలో కూడా కీలకంగా మారింది. మూడు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు పట్టం కడుతుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. మున్సిపాలిటీలో గెలిపించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
పాలమూరు తొలిమేయర్ ఎవరో?
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రతిష్టంబన నెలకొన్నది. కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లో కాంగ్రెస్ 29డివిజన్లు గెలుచుకున్నది. బీఆర్ఎస్ 16, బీజేపీ 8, ఎంఐఎం మూడు , స్వతంత్రులు నాలుగు చోట్ల గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ మరో రెండు కార్పొరేటర్లు అవసరం. అయితే ఇండిపెండెంట్ల సహకారంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా మేయర్ ఎవరనేది ఇంకా ఆ పార్టీలో స్పష్టత లేకుండా పోయింది. అయితే మెజారిటీగా 49వ డివిజన్ కార్పొరేటర్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ప్రసన్న ఆనంద్‌కుమార్ గౌడ్ పేరును అధిష్టానం ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు సీల్డ్కవర్లో వచ్చే అవకాశం ఉన్నది. అయితే డిప్యూటీ మేయర్ కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు.. నాలుగు దశాబ్దాలుగా మీడియా ఇన్చార్జిగా ఉంటూ పార్టీని సమన్వయం చేస్తున్న సీజే బెనహర్ కూతురుకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్న తెలుస్తోంది.
నేడే పాలకవర్గాల ప్రమాణ స్వీకారం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక సమావేశాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11గంటలకు వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు పదవి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేపడతారు. కౌన్సిల్ సమావేశం హాల్లో పార్టీలవారీగా సీట్లు కేటాయిస్తున్నారు. ఆయా పార్టీలు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఈ విప్లో పార్టీ విధివిధానాలకు అనుకూలంగా ఓటేయాలని ఆదేశించారు. ఒకవేళ విప్‌నకు వ్యతిరేకంగా ఓటువేస్తే అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరో ఉత్పంటగా ఎదురుచూస్తున్నారు.