రంగారెడ్డి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దాదాపు రెండేండ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండటంతో ప్రమాణ స్వీకారాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
అనంతరం 12:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నా రు. ప్రమాణస్వీకారం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీకి చెందిన వారు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక లాంచనమే కానున్నది. అలాగే, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్పల్లిల్లో కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది.
ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా అక్కడ కాం గ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తుకు తెరలేపాయి. ఈ మున్సిపాలిటీలో 15 వార్డులుండగా అందులో ఎనిమిది వార్డుల్లో బీఆర్ఎస్, ఆరు వార్డుల్లో బీజేపీ, ఒక్క వార్డులో కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్, బీజేపీలు పొత్తుపెట్టుకుని మరో ఇద్దరు కాంగ్రెస్‌కు చెందిన ఎక్స్అఫీషియో సభ్యులతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కుయుక్తులు చేస్తున్నాయి.
మొయినాబాద్ మున్సిపాలిటీలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికీ దక్కుతాయన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ మున్సిపాలిటీలో 26 వార్డులుండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్లుగా గెలుపొందిన ఐదుగురు కీలకంగా మారారు. ఇక్కడ బీఆర్ఎస్ వార్డుల్లో గెలవగా ఒక వార్డు సభ్యుడ్ని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇండిపెండెంట్ల సహకారంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవాలని బీఆర్ఎస్ యత్నించింది. కాగా, మరోవైపు కాంగ్రెస్‌పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తుండడంతో చైర్మన్, వైస్‌చైర్మన్‌పై ఉత్కంఠ వీడడం లేదు..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నది. 13 వార్డుల్లో విజయం సాధించింది. అంతేకాకుండా మూడోవార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యరి కూడా బీఆర్ఎస్ గూటికి చేరడంతో బీఆర్ఎస్కే చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు దక్కనున్నాయి.