హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లో జీఎస్టీ రూపేణా రూ.24.218 కోట్లు వసూలు చేసిన తెలంగాణకు ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లో రూ.34,729 కోట్ల రాబడి వచ్చింది. ఇది ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రూ.42,189 కోట్ల వసూళ్లలో 82.32 శాతానికి సమానం.
ఐదేండ్ల క్రితం ఇదే సమయంలో వచ్చిన వసూళ్ల కంటే 44 శాతం.. గత ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లో వచ్చిన రూ.27,348 కోట్ల రాబడి కంటే 27 శాతం ఎక్కువ. బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి రెండు నెలల్లో రాష్ర్టానికి మరో రూ.7,460 కోట్ల జీఎస్టీ రావాల్సి ఉన్నది. అయితే ఈసారి రాష్ట్రంలో బడ్జెట్ అంచనాలకు మించి జీఎస్టీ వసూలవుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది.
Poml