PRLIS | హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో కదలిక వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకం (పీఆర్ఎల్ఐఎస్) పనులను చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ 3 పనులతోపాటు రిజర్వాయర్లను పూర్తిచేయాలని అధికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. పీఆర్ఎల్ఐఎస్ పనులను కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దాదాపు పూర్తిచేసింది. రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తయింది. కల్వకుర్తి ఆయకట్టుకు సైతం ప్రాజెక్టును అనుసంధానం చేసింది. నార్లాపూర్‌లో ఎత్తిపోతలను కూడా ప్రారంభించింది. ప్యాకేజీ 3లో అంటే అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్ నుంచి వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్ వరకు జలాలను తరలించే కెనాల్ పనులు కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ సర్కారు ఆయా పనులను అసలే పక్కకు పెట్టింది. ఇతర కాల్వల టెండర్లను సైతం రద్దుచేసింది. ఈ నేపథ్యంలోనే ‘పాలమూరుపై పగ.. కల్వకుర్తి దగా’ పేరిట ఇటీవల నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సెక్రటేరియట్లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖలోని ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
ప్రాజెక్టు పనులను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష అనంతరం ఆదేశించారు. ప్యాకేజీ3 కాల్వ పనులను వెంటనే ప్రారంభించాలని, ప్రాజెక్టులోని రిజర్వాయర్లు అన్నింటినీ డిసెంబర్ నాటికి సిద్ధంచేసి 50 టీఎంసీల నీటిని నింపేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏదుల, వట్టెం పంపింగ్ స్టేషన్ల డ్రైరన్ నిర్వహించాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టాలని, రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యాన్ని 12 టీఎంసీలకు పునరుద్ధరించాలని నిర్ణయించారు.