TG SSC Exam Schedule | తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అన్ని సాధారణ అకడమిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆబ్జెక్టివ్ టైప్ (పార్ట్-బి) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లోనే సమాధానాలు రాయాలని స్పష్టం చేసింది. ఇక ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే జరుగుతాయని తెలిపింది. చివరి 15 నిమిషాల్లోనే పార్ట్ బి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని పేర్కొంది.
మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 23న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 28న గణితం
ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం
ఏప్రిల్ 7న జీవశాస్త్రం
ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్
ఏప్రిల్ 15న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
ఏప్రిల్ 16న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I I
ఈ సారి పరీక్ష తేదీల షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. పరీక్షకు.. పరీక్షకు మధ్య ఒకట్రెండు రోజులు విరామం ఇవ్వనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ పరీక్షల్లోనూ ఇదే తరహా వ్యవధి ఇస్తున్నారు. దీంతో మన దగ్గర సైతం ఇదే పద్ధతి అనుసరించాలని నిర్ణయించారు. కొన్ని పరీక్షలకు ఒక రోజు.. మరికొన్ని పరీక్షలకు రెండు రోజుల గ్యాప్ రానున్నది. అయితే పరీక్షల మధ్యలో రంజాన్, ఉగాది, మహావీర్ జయంతి, శ్రీరామనవమి వంటి పండుగలు రానున్నాయి. దీంతో కొన్ని పరీక్షలకు నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ ఉండనున్నది.

Tg Ssc Exam Schedule