SSC Exams | హైదరాబాద్/వికారాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా పరీక్షలు వాయిదా పడుతాయని సోషల్‌మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర విద్యాశాఖ స్పందించింది. షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలను 13 వరకు నిర్వహిస్తామని శ్రీదేవసేన స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిద్రండులు ఆందోళన చెందవద్దని సూచించారు. తెలుగు ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బందెప్ప, ఫిజిక్స్ టీచర్ సమ్మప్పతోపాటు చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్‌ను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. బాధ్యులపై యాక్ట్ 25/ 1997 ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించామ ని తెలిపారు. పరీక్ష ఉదయం 9:30 ప్రారం భం కాగా, ఉదయం 9:37 గంటలకు బం దెప్ప వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రాన్ని సమ్మప్ప కు పంపించారని వెల్లడించారు. దీనిపై కలెక్టర్‌తో విచారణ చేయించామని చెప్పారు. పరీక్షా హాల్లోకి బయటి వ్యక్తులు రాలేదని, పరీక్ష సిబ్బంది ఎవరూ సెంటర్‌ను విడిచివెళ్లలేదని, ఇతరుల చేతికి ప్రశ్నపత్రం చేరడంవంటి ఉల్లంఘనలు జరుగలేదని తెలిపారు.
సెల్ఫోన్లపై నిషేధం ఉన్నా..!
టెన్త్ పరీక్షల విధుల్లో ఉన్నవారు సెల్ఫోన్లు వినియోగించరాదని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు ముందే హెచ్చరించారు. నిరుడు కూ డా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించలేదు. పరీక్షల విధుల్లో ఉన్న టీచర్ బందెప్ప నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను పరీక్షాకేంద్రం లోపలికి తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి ఇన్విజిలేటర్ సమ్మప్పకు పంపించాడు. ఇదే విషయంపై సోమవారం శ్రీదేవసేన డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యాశాఖ ఆదేశాలు..
తమ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్ జరిగితే జిల్లా, మండల విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలి.
డీఈవోలు, ఎంఈవోలు ఫిర్యాదుల రిజిస్టర్‌ను నిర్వహించి, కాపీయింగ్‌పై వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలి.
కాపీయింగ్ లేదా ఇతర ఉల్లంఘనలు చోటుచేసుకొంటే ఫిర్యాదు చేసేందుకు డీ ఈవో, ఎంఈవోల మొబైల్ నంబర్లను కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి.
ఏ గదిలో కాపీయింగ్ జరిగితే ఆ గదిలోని ఇన్విజిలేటరే కాపీయింగ్‌కు బాధ్యత వహిస్తారు. వారికి కేటాయించిన గదిలో కాపీయింగ్ జరిగితే సంబంధిత టీచర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకొంటారు.
పరీక్ష ప్రారంభమైన తర్వాతే పేపర్ బయటకు: కలెక్టర్
తాండూర్లోని నంబర్-1 ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన తర్వాత 7 నిమిషాలకు తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని కలెక్టర్ సీ నారాయణరెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై సోమవారం కలెక్టరేట్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. పరీక్ష సమయం కంటే ముందు ప్రశ్నపత్రం బయటకు రాలేదని చెప్పారు. తాండూర్లోని నంబర్ వన్ ప్రభుత్వ పాఠశాల రూం నంబర్-5లో గైర్హాజరైన విద్యార్థికి చెందిన పశ్నపత్రాన్ని రిలీవర్‌గా పనిచేస్తున్న బందెప్ప తన ఫోన్ ద్వారా ఫొటోలు తీసి ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమ్మప్ప (స్కూల్ అసిస్టెంట్- ఫిజికల్సైన్స్)కు వాట్సాప్ ద్వారా పం పించే క్రమంలో ఓ మీడియా గ్రూప్‌లో షేర్ చే శాడని చెప్పారు. అనంతరం గమనించి డిలీట్ చేసినప్పటికీ.. గ్రూప్‌లో ఉన్న మిగతా సభ్యులు దాన్ని మిగతావారికి షేర్ చేసినట్టు తెలిపారు. బందెప్ప, సమ్మప్ప నుంచి ప్రశ్నపత్రం ఎక్కడికీ షేర్ కానందున పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని పే ర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బందెప్ప, సమ్మప్పను విధుల నుంచి సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్‌తోపాటు డిపార్ట్మెంటల్ అధికారి కే గో పాల్‌ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. రికవరీ ప్రశ్నపత్రాన్ని క్లర్క్‌కు బదులు రిలీవర్‌కు అప్పజెప్పిన ఇన్విజిలేటర్ శ్రీనివాస్‌ను విధుల నుంచి తప్పిస్తున్నామని తెలిపారు.
జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్
ఎదులాపురం: ఆదిలాబాద్ జిల్లాలో విద్యా ర్థుల జవాబు పత్రాలు బండిల్ మిస్ అయింది. సోమవారం ఉట్నూర్‌లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను విద్యా శాఖ అధికారులు ప్యాక్ చేసి పోస్టాఫీసులో అప్పగించారు. పోస్టల్ సిబ్బంది పేపర్ బండిల్‌ను ఆదిలాబాద్ హెడ్‌పోస్టాఫీసుకు తరలించడానికి ఆటోలో ఉ ట్నూర్ బస్టాండ్‌కు తీసుకుపోతుండగా మార్గమధ్యలో పడిపోయింది. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో ‘పరీక్ష’
కరీంనగర్/ఖమ్మం: సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పదో తరగతి తొలి పరీక్షకు కొంతమంది విద్యార్థులు ప్రత్యేక పరిస్థితుల్లో హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తాడూరి నాగరాజు(15 )అనే మరుగుజ్జు దివ్యాంగుడు పట్టణంలోని న్యూ శాతవాహన హైసూల్ సెంటర్లో సోమవారం పరీక్ష రాశాడు. ఇదే జిల్లాలో ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉపాధ్యాయురాలు రజిత కొడుకు ప్రజ్ఞాన్రెడ్డి ఆ బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పరీక్షకు హాజరై బాధాతప్త హృదయంతో పరీక్ష రాశాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ మానసిక దివ్యాంగుడు ఓ సహాయకురాలితో వచ్చి టెన్త్ పరీక్ష రాశాడు.
‘పది’ పరీక్షలు ప్రారంభం..
టెన్త్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ భాష (తెలుగు) పరీక్ష నిర్వహించారు. 99.60 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు 4,87,050 మందికి 4,84,885 మంది హాజరైనట్టు, 2,165 మంది గైర్హాజరైనట్టు అధికారులు చెప్పారు.

Students