హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మునుపెన్నడూ లేని విధంగా ఇటు అసెంబ్లీలో, అటు మండలిలో పోలీసుల ఆంక్షలు ఎకువయ్యాయి. అసెంబ్లీ ఆవరణలో ఎకడ చూసినా అనవసరపు బారికేడ్లే దర్శనమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం మీడియా అపాయింట్ నుంచి అసెంబ్లీ ప్రాంగణం వైపు వెళ్లేందుకు మీడియాపై అనేక ఆంక్షలు విధించారు. జర్నలిస్టుల వివరాలు నమోదు చేసుకొని లోపలికి పోనిచ్చారు. ఇదేమిటని ప్రశ్నించగా.. తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని.. తప్పకుండా వివరాలు ఇవ్వాల్సిందేనంటూ.. జర్నలిస్టు పేరు, ఫోన్ నంబర్, పనిచేస్తున్న మీడియా వివరాలు తీసుకున్నారు.
ఐడీ కార్డులను చూపిస్తూ దాదాపు నాలుగు దశలను దాటుకొని వచ్చినా.. మళ్లీ పోలీసులు వివరాలు అడగటం పట్ల కొందరు జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కొందరు జర్నలిస్టులు అసెంబ్లీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయడంతో సాయం త్రం తర్వాత వివరాలు తీసుకోవడం మానేశారు. మరోవైపు మండలిలో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది. అకడ కూడా జర్నలిస్టుల కంటే పోలీసులు, మార్షల్స్, అధిక సంఖ్యలో కనిపించారు.
ఇలాంటి చర్యలు సబబు కాదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్దకు ఎవరైనా ప్రతిపక్ష ఎ మ్మెల్యేలు మాట్లాడేందుకు వస్తే.. వారి మాటలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని అంటూ అసెంబ్లీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉదయమే వచ్చి కెమెరామెన్లకు, ఫొటోగ్రాఫర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇలా లేదు కదా అని ప్రశ్నించగా.. పైనుంచి ఆదేశాలొచ్చాయ ని పాటించాల్సిందేనని చెప్పి వెళ్లిపోయారు.