హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సర్పంచులకు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి పది నెలలైనా ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ అమరజ్యోతి వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, అయినా వారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక మంది సర్పంచులు అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నా సర్కారు కరుణించకపోవడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా బిల్లుల చెల్లింపుపై ఈ నెల 30లోగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
తాము సొంత నిధులతో పనులు చేపట్టామని, ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని ఆశిస్తే ఇప్పటి వరకు రాలేదని, గ్రామాల అభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తే ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగయ్య, రాష్ట్ర నాయకులు కేసబోయిన మల్లయ్య, మేడబోయిన గణేశ్, నవీన్‌గౌడ్, సుముద్రాల రమేశ్, ఎర్రగోగుల యశ్వంత్, బీరప్ప, పచ్చబోయిన రామకృష్ణ, మహిళా నేతలు చిన్నం లావణ్య, రెక్కల ఇంద్రాసత్తిరెడ్డి పాల్గొన్నారు.