Telangana | హైదరాబాద్ : తమపై కక్ష సాధింపు చర్యలు మానేసి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇప్పటికే అనేక మంది సర్పంచ్లు అప్పులు చేసి, తిరిగి వాటిని చెల్లించనందుకు.. వారి వేధింపులు భరించలేక అనేకమంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు.
ఇంకా చాలా మంది సర్పంచుల కుటుంబాలు అప్పుల బాధతో చిన్నాభిన్నామవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మెడబోయిన గణేష్, పద్మా రెడ్డి, బీరప్ప, రవి పాల్గొన్నారు.