హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులపాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’గా నామకరణం చేసింది. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ‘టాటా ఇంటర్ చేంజ్’ అని పేరు పెట్టింది. గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ అంశాలపై చర్చల అనంతరం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి నిర్వహించనున్నారు. రెండో రోజైన మంగళవారం ‘తెలంగాణ రైజింగ్-2047’ నివేదికను విడుదల చేయనున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, బెటాలియన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఏఆర్, స్పెషల్ పార్టీ తదితర విభాగాల నుంచి మొత్తం 6 వేల మంది సిబ్బందిని మోహరించామని, వీరంతా రెండ్రోజులపాటు బందోబస్తు విధుల్లో ఉంటారని ప్రకటించారు. మొత్తం ఆరు అంచెల భద్రత నడుమ ఈ కార్యక్రమం జరుగుతుందని, సమ్మిట్ ప్రధాన వేదిక వద్ద ముగ్గురు అడిషనల్ డీజీలు, ఐదుగురు ఐజీపీలు, 10 మంది ఐపీఎస్‌లు, 170 మంది యువ పోలీస్ అధికారులు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాంకేతికతలో నిపుణులైన డీసీపీ స్థాయి సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారని వివరించారు.
పార్కింగ్ మేనేజ్మెంట్కు డీసీపీ స్థాయి అధికారులను నియమించామని, సభాప్రాంగణానికి వచ్చే వీవీఐపీల భద్రత కోసం స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఈవెంట్ సెక్యూరిటీ టీమ్‌లు ఉంటాయని తెలిపారు. వేదికతోపాటు వీవీఐపీలు వచ్చే మార్గాలు, పారింగ్ జోన్లలో 115 నైట్-విజన్, పీటీజెడ్ కెమెరాలు అమర్చామని, ఇవి ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయని పేర్కొన్నారు. టాఫిక్, భద్రత, సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించేందుకు 10 డ్రోన్ బృందాలను మోహరించినట్టు తెలిపారు. ఆదివారం సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.