TG Rains | హైదరాబాద్ : ఈ ఏడాది తెలంగాణలో వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు 898.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా 668.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ 34 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబరు 17 నాటికి వాయువ్యం నుండి తిరోగమనం చెందుతాయి. ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలో 78 శాతం నుంచి 102 శాతం వరకు భారీ వర్షపాతం నమోదైంది.
కామారెడ్డి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయింది. మరో 21 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు వర్షపాతం నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 693.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 547.8 మి.మీ. పోల్చితే 27 శాతం అధికమని అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఐదు జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. 21 జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
ఇవి కూడా చదవండి..
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Breast Cancer | ‘రొమ్ము క్యాన్సర్’ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. వేల మరణాలను ఆపుతున్న అంధులు
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్