Breast Cancer | కళ్లు లేవని వాళ్లు కలత చెందలేదు! తమకున్న అసాధారణ సర్శ జ్ఞానంతో.. అద్భుతాలు చేస్తున్నారు. ‘రొమ్ము క్యాన్సర్’ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. వేల మరణాలను ఆపుతున్నారు. ప్రాణాంతక వ్యాధిని పసిగట్టడంలో.. అంధ మహిళలు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
మనదేశంలో ఏటా సుమారు 75,000 మంది రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఇందుకు కారణాలు అనేకం.. భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. ఈ వ్యాధిని గుర్తించే ‘మమోగ్రఫీ పరీక్ష’ చేయడానికి కావాల్సిన పరికరాల కొరత ఇంకోటి! ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య మరీ ఎక్కువ! ఫలితంగా.. రొమ్ము క్యాన్సర్‌ను మూడు లేదా నాలుగో దశలోనే గుర్తిస్తున్నారు. దాంతో సరైన చికిత్స అందకపోవడంతో వేలమంది మరణిస్తున్నారు. ఈ సమస్యకు అంధ మహిళలు అద్భుతమైన పరిష్కారం చూపుతున్నారు.
‘రొమ్ము క్యాన్సర్ కణితిని ఎంత త్వరగా గుర్తిస్తే.. అంతమంచి చికిత్స అందించవచ్చు!’.. జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్.ఫ్రాంక్ హాఫ్మన్ చెప్పేమాట. ఆయన ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే.. ‘డిస్కవరింగ్ హ్యాండ్స్’. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థ.. జర్మనీతోపాటు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న రొమ్ము క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించడంలో సాయపడుతున్నది. ఇందుకోసం వైద్యులకు సహాయక సిబ్బందిగా అంధ మహిళలకు ప్రత్యేక్ష శిక్షణ ఇప్పిస్తున్నది. వారే ఎందుకంటే.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారిలో ‘స్పర్శ జ్ఞానం’ ఎక్కువ. అంతేకాకుండా.. వారి విద్యాభ్యాసం అంతా ‘బ్రెయిలీ’లోనే సాగుతుంది.
ఈ చుక్కల లిపిని చేతులతో తడుముతూ.. పదాలను గుర్తించగలుగుతారు. అలా వారిలో ‘స్పర్శ జ్ఞానం’ ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ అనుభవాన్నే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి వాడుతున్నారు. తమ చేతి స్పర్శ ద్వారా.. ప్రారంభ దశలలో ఉన్న సూక్ష్మ కణతులను కూడా వీరు స్పష్టంగా గుర్తిస్తున్నారు. వైద్యులు 1 నుంచి 2 సెం.మీ. గడ్డలను కనుగొంటే.. దృష్టిలోపం ఉన్న మహిళలు 0.5 సెం.మీ. కణతులనూ గుర్తించగలుగుతున్నారు.
‘డిస్కవరింగ్ హ్యాండ్స్’ సంస్థ ద్వారా భారతదేశంలోని పలు నగరాల్లో ‘రొమ్ము క్యాన్సర్’ను గుర్తించడంపై అంధ మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. తొమ్మిది నెలల శిక్షణలో.. ఆరు నెలలు స్టడీకోర్స్తోపాటు మూడు నెలలు ఇంటర్న్‌షిప్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా.. వీరు మహిళల
శరీరం గురించి ముఖ్యంగా రొమ్ము అనాటమీపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. ట్రైనింగ్ తర్వాత ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్యులకు సహాయకులుగా, లేదా ఫ్రీలాన్స్ మెడికల్ టాక్టయిల్ ఎగ్జామినర్‌గా పనిచేస్తున్నారు. వీరు చర్మానికి అనుకూలమైన టేప్‌ను ఉపయోగిస్తూ.. రోగి ప్రతి రొమ్మునూ నాలుగు జోన్లుగా విభజిస్తారు.
చేతివేళ్లతో సున్నితంగా పరిశీలించడం, వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి రొమ్ములో ప్రతి అంగుళాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. అక్కడి కణజాలాల్లో జరుగుతున్న మార్పులను వైద్యులకన్నా 30% మెరుగ్గా గుర్తిస్తున్నారు. కేవలం 35 నుంచి 40 నిమిషాల్లోనే రోగిని పరీక్షించి.. రొమ్ము క్యాన్సర్ కణతులను కనిపెడతారు. 2023 రికార్డుల ప్రకారం.. భారత్‌లో నిర్వహించిన ‘డిస్కవరీ హ్యాండ్స్’ ప్రోగ్రాం ద్వారా 1,338 మంది మహిళల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే కనుగొన్నారు.