Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల హయాంలో తెలంగాణలో వందేండ్ల విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి చేరుకొన్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలందరికీ చెంపపెట్టులాంటి వార్త ఇది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, చిన్న రాష్ర్టాలకు ఓ సక్సెస్ఫుల్ మాడల్‌గా నిలిచిందని బ్రిటిష్ వీక్లీ ‘ది ఎకానమిస్ట్’ ఇటీవల ప్రశంసించగా, తాజాగా కేంద్ర ప్రభుత్వ మేధోసంస్థ నీతి ఆయోగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, విద్యుత్తు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, నగరీకరణ తదితర అంశాల్లో తెలంగాణ మెరుగైన ప్రగతి సాధించిందని వెల్లడించింది. ఈ మేరకు రెండు రోజుల కిందట ‘స్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) ఇండియా సూచీ, 2023-24’ నివేదికలో పలు వివరాలను వివరించింది.
తగ్గిన పేదరికం : దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్టు నీతిఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2005-06 నుంచి ఇప్పటివరకు దేశంలో ‘బహుముఖ పేదరికం’పై (మల్టీ డైమెన్షనల్ పావర్టీ) నీతి ఆయోగ్ విడతలవారీగా నివేదికలను విడుదల చేస్తూ వస్తున్నది. తాజా నివేదిక ప్రకారం.. దేశంలో సగటున ప్రతి వందమందిలో ఇంకా 28 మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. తెలంగాణలో మాత్రం ప్రతీవందమందిలో సగటున 91 మంది పేదరికం నుంచి బయటపడగా, కేవలం ఎనిమిది మంది మాత్రమే పేదరికంలో ఉన్నట్టు నీతిఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 92 స్కోరుతో పొరుగురాష్ట్రం తమిళనాడు పేదరికం తక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 91 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 86 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకొన్నది. దేశంలో అతితక్కువ పేదరికం ఉన్న రాష్ర్టాల జాబితాలో టాప్-3 రాష్ర్టాలు దక్షిణాదివే కావడం విశేషం. కాగా, బీజేపీపాలిత యూపీ 57, ఎన్డీయేపాలిత బీహార్ 39 స్కోరుతో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలుగా మిగిలాయి.
పేదరికం, ఆకలి సమస్యలు, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, శుద్ధమైన తాగునీరు-పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ ఇలా మొత్తం 13 అంశాల్లో నీతిఆయోగ్ స్కోర్‌ను వెల్లడించగా.. 12 కీలక అంశాల్లో తెలంగాణ మెరుగైన పనితీరు కనబర్చింది. సరసమైన రేటులో నాణ్యమైన విద్యుత్తు సరఫరా అంశంలో 100 మార్కులతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో 91 మార్కులతో రెండో స్థానంలో, ఆర్థికాభివృద్ధిలో 84 మార్కులతో మూడో స్థానాన్ని దక్కించుకొన్నది. సేవల రంగంలో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వాటాను పెంచడంలో, అటవీ విస్తీర్ణం పెంచడంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు నివేదిక వివరించింది.
అందుబాటు రేటులో నాణ్యమైన విద్యుత్తు సరఫరా
అచీవర్ 100 మార్కులు
ఫ్రంట్ రన్నర్ 65-99 మార్కులు
పేదరిక నిర్మూలన, మెరుగైన వైద్యం, శుద్ధమైన నీరు,ఆర్థికాభివృద్ధి, అసమానతల తొలగింపు, నగరీకరణ, బాధ్యతాయుత ఉత్పత్తి-వ్యయం
పెర్ఫార్మర్ (50-64 మార్కులు)
ఆకలి బాధలు లేకపోవడం, నాణ్యమైన విద్య, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులపై చర్యలు
