హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): వర్ష బీభత్సం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లోని పంటలకు నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. దీంతో వేలాది మంది రైతులకు తీరని నష్టం మిగిలింది. మంగళ, బుధవారాల్లో కురిసన భారీ వర్షాలకు కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. మిగతా జిల్లాల్లోనూ పంటలకు నష్టం తప్పలేదు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల కట్టలు తెగిపోవడంతో ఆ నీళ్లన్నీ పంట పొలాల గుండా భారీ వరదలు ప్రవహించడంతో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పొలాల్లోనే నీళ్లు నిలవడంతో పంటలు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పంటలు నామారూపాల్లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా పంటపొలాల్లో నీళ్లు, ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి.
ఈ వర్షాలు పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. భారీ వరదలకు చాలాచోట్ల పంట కొట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూతకొచ్చిన పత్తి పాడైపోతున్నది. మిగిలిన పంట చేలల్లో రోజుల తరబడి వర్షపు నీరు నిలిచి, పత్తి ఎర్రబారి దిగుబడి తగ్గుతుంది. వర్షాలు మరికొన్నిరోజులు వస్తే పంటపై గులాబీ పురుగు సోకే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓవైపు వర్షాలు, మరోవైపు గులాబీ పురుగుతో పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పంటలు అతలాకుతలం కావడంతో నష్టాలపాలైన రైతులు ఆవేదనలో కుంగిపోతుంటే, పంటనష్టం అంచనా వేయడంలో సర్కారు కనీస చొరవ తీసుకోలేదు. ఇప్పటివరకు వ్యవసాయ శాఖ పంటనష్టం అంచనాలు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులకు ఎలాంటి ఆదేశాలూ వెళ్లలేదని తెలిసింది.
నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండలం ముజ్గి, తాంశ, చిట్యాల్ మంజులాపూర్ శివారులో దాదాపు 100 ఎకరాల వరకు వరిపంట నీట మునిగింది. అలాగే సోన్ మండలం కడ్తాల్లో స్వర్ణ వాగు ఉప్పొంగడంతో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకున్నది. కుంటాల మండలంలోని వెంకూర్ శివారులో పత్తి, సోయా పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలో చాలాచోట్ల వరితోపాటు, పత్తి, సోయా, మక్క పంటలు నీట మునిగాయి.
ములుగు, జయశంకర్-భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు ధ్వంసమై వరదనీటితో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పలు చెరువులు మత్తళ్లు పడుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు 1వ ప్రమాదపు సూచికలో ప్రవహిస్తున్నది. దాని పరీవాహక ప్రాంత పంట పొలాలన్నీ వరదనీటిలోనే మునిగాయి. గణపురం మండలం అప్పయ్యపల్లి, నగరంపల్లి మధ్యన ఉన్న ముసళ్లకుంటకు గండిపడింది. పలిమెల మండలం లెంకలగడ్డలో వేసిన ఎకరం మిరపనారు కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండటంతో దానికింద పంట పొలాలన్నీ పూర్తిగా నీటమునిగాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 15,686 ఎకరాల్లో పంటల నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 2,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 6,341 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 7,345 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. చిన్నశంకరంపేట శివారులో పంటపొలాలు పూర్తిగా నీట ముగినిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వరదనీటిని వదలకపోవడంతో జిల్లాలోని అనేక గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. నిజాంపేట మండలం నందిగామలోని సాయి చెరువు పకన గల పౌల్టీ ఫాంలో 10 వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి.