ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు మాత్రమేనని..నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించిన డీజీపీ.. మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సరిహద్దులో గంజాయికి వ్యతిరేకంగా మావోయిస్టులు పనిచేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ ప్రధాన లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నదని చెప్పారు. పలు రాష్ర్టాలకు ఎంట్రీ పాయింట్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నందున ఇక్కడి నుంచే మాదకద్రవ్యాల నియంత్రణ ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. నేరాల నియంత్రణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో రూ.11 కోట్ల దోపిడీ జరిగిందని, సైబర్ క్రైమ్‌లో రూ.42 కోట్లు పొగొట్టుకున్నారని వివరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సామినేని రామారావు హత్యకేసు విచారణ నెలరోజుల్లో పూర్తి చేయాలని సీపీని ఆదేశించారు. రాష్ట్రంలో మావోయిస్టులపై నిఘా కొనసాగుతున్నదని, లొంగిపోయినవారి కదలికపై దృష్టి సారించామ ని చెప్పారు. సమావేశంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, సీపీ సునీల్‌దత్, ఏసీపీ వసుంధర పాల్గొన్నారు.